YS Sharmila: తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఎటువైపుకు మళ్లుతాయో ఎవరికీ అర్థం కావడం లేదు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా ఎన్నికలకు సన్నద్ధం చేసుకుంటున్నట్టు వాతావరణం కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ అధినేత రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలపడకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి రైతు వ్యతిరేకిగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. యాసంగి పంట కొనుగోలు చేస్తారా లేదా అనేదానిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే గులాబీ పార్టీ ‘మహాధర్నా’, చావు డప్పు లాంటి కార్యక్రమాలు చేపడుతోంది. బీజేపీ కూడా టీఆర్ఎస్‌వి అని జూట మాటలు అంటూ ప్రచారం చేస్తోంది. ఇక కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇలా తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ బిజీబిజీగా గడుపుతుంటే వైఎస్ షర్మిల మాత్రం ఓదార్పు యాత్రలు చేస్తోంది. కానీ మీడియాలో మాత్రం షర్మిల కనిపించడం లేదు. ఓన్లీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అప్‌డేట్స్‌ను మాత్రమే హైలెట్ చేస్తున్నాయి.

షర్మిలకు మీడియా కవరేజీ ఏది..
తెలంగాణలో మొన్నటివరకు పాదయాత్ర చేపట్టిన షర్మిల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులోకి రావడంతో తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఎలక్షన్ ముగిసాక ఎక్కడైతే తన పాదయాత్రను ముగించారో మళ్లీ అక్కడి నుంచే ప్రారంభిస్తారని అంతా భావించారు. అయితే, షర్మిల ఒక్కసారిగా తన మనసు మార్చుకున్నారు. పాదయాత్రలో ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదని చనిపోయిన నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శించిన షర్మిల.. తాజాగా రాష్ట్రంలో చనిపోతున్న అన్నదాతల కుటుంబాలను ఓదార్చాలని నిర్ణయించింది. అందుకోసం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి ఓదార్పు యాత్ర ప్రారంభించింది. రాష్ట్రంలో కురిసిన అకాలవర్షాలు, అప్పుల భారం భరించలేక, ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఓదార్చాలని షర్మిల నిర్ణయించింది. అందుకోసం రోజుకో రైతు కుటుంబాన్నిఓదారుస్తూ వస్తోంది. కానీ ఇది తెలంగాణ మీడియా చానళ్లు ప్రసారం చేయడం లేదు.
తెలంగాణ మీడియా కావాలనే పక్కన పెట్టిందా..
షర్మిల పాదయాత్రకు కవరేజీ ఇచ్చిన మీడియా ఒక్కసారిగా ఓదార్పు యాత్రను ఎందుకు కవరేజీ ఇవ్వడం లేదని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కావాలనే రాష్ట్ర మీడియా షర్మిలను పక్కన పెట్టిందా? లేదా ప్రసారం చేయాలంటే ఏమైనా అగ్రిమెంట్ కోరుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఒక్క ఆంధ్రజ్యోతి మినహా ఏ ప్రధాన మీడియాలోనూ షర్మిల ఓదార్పు యాత్ర గురించి వార్తలు రావడం లేదు. తమ ఫ్యామిలీ చానల్ సాక్షిలో కూడా షర్మిల గురించి వార్తలు రావడం లేదంటే అతిశయోక్తి కాదు..ఒకప్పుడు జగన్ పాదయాత్ర ఓదార్పు యాత్ర చేసి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అలాగే తెలంగాణలోనూ షర్మిల అధికారంలోకి రావాలని ఓదార్పు యాత్ర చేపట్టారు. బాధిత రైతు కుటుంబాలను కలసి కొంత ఆర్థికసాయం చేసి నెంబర్ ఇచ్చి మరీ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని చెబుతున్నారు. కానీ దీనికి ప్రధాన మీడియా కవరేజీ ఇవ్వడంలేదు.
Also Read: షర్మిల రైతు ఆవేదన యాత్ర.. పులివెందుల టూర్ పైన చర్చ!
జగన్ ఓదార్పు యాత్రను తన సొంత మీడియాతో పాటు ఇతర ప్రధాన మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా భారీగా కవరేజీ ఇవ్వడం వల్లే జనం జగన్‌ను నమ్మారు. ఆయన వైపు చూశారు. అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారు. కానీ షర్మిలకు కవరేజీ లేకపోతే ఆమె ఎన్నిమంచి పనులు చేసినా జనంలోకి వెళ్లలేదు. ఫలితంగా షర్మిల పార్టీకి మాత్రమే పరిమితం అవుతారు. అయితే, మీడియా ఇలా ఎందుకు చేస్తుంది. ప్రధాన పార్టీలతో మీడియా ఒప్పందం కుదుర్చుకుందా? కావాలనే షర్మిలను ఒంటరి చేస్తున్నారా? షర్మిల సీఎం కేసీఆర్ పై రోజుకో విమర్శలు చేస్తున్నారు. కానీ అధికార పార్టీ నేతలు ఆమెను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అందుకే కౌంటర్స్ కూడా ఇవ్వడం లేదని టాక్ నడుస్తోంది. రానున్న రోజుల్లో మీడియా షర్మిలను పక్కన పెడితే ఆమె రాజకీయ భవిష్యత్తు అంధకారమే అని పొలిటికల్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: బాప్ రే.. తెలంగాణ రాష్ట్రంపై ఇన్ని అప్పులా? తెలిస్తే షాక్ అవుతారు