
గడిచిన ఆరేళ్లలో తెలంగాణ రైతులల్లో అద్భుతమైన మార్పు వచ్చిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. రబీలో ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రభాగాన నిలిచినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రభాగాన నిలవడం.. తెలంగాణ రైతులు, ప్రజానీకం గర్వించదగ్గ సందర్భమని కేటీఆర్ అన్నారు. ఆరేళ్ల లోపే సీఎం కేసీఆర్ నేతృత్వంలో అద్భుతమైన మార్పు కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు. దేశ వ్యాప్తంగా గోధుమలు, బియ్యం కొనుగోళ్లు చేసినట్లు ట్విట్టర్ లో కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా 50 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. 50 లక్షల టన్నుల బియ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 44.36 లక్షల టన్నులు అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి 34.36 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు చేయగా, ఏపీ నుంచి 10 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు