https://oktelugu.com/

Telangana Intermediate Board: ఇంటర్‌ ఫలితాల పెంపు కోసం.. ప్రీ ఫైనల్‌ ప్రయోగం ఫలించేనా?

Telangana Intermediate Board:  ఇంటర్‌ పరీక్షలకు ఇంకా నెల రోజులకుపైగా సమయం ఉంది. కరోనా కారణంగా రెండు బ్యాచ్‌లను పరీక్ష లేకుండానే పాస్‌ చేసిన తెలంగాణ ప్రభుత్వం కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత గత సెప్టెంబర్‌లో ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించింది. కరోనా కాలంలో ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగించిన ఇంటర్‌ బోర్డు.. సిలబస్‌ తగ్గించి ఎక్కువ చాయిస్‌ ప్రశ్నలతో పరీక్షలు నిర్వహించింది. ఇందులో కేవలం 40 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 60 శాతం […]

Written By:
  • NARESH
  • , Updated On : March 27, 2022 / 12:06 PM IST
    Follow us on

    Telangana Intermediate Board:  ఇంటర్‌ పరీక్షలకు ఇంకా నెల రోజులకుపైగా సమయం ఉంది. కరోనా కారణంగా రెండు బ్యాచ్‌లను పరీక్ష లేకుండానే పాస్‌ చేసిన తెలంగాణ ప్రభుత్వం కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత గత సెప్టెంబర్‌లో ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించింది. కరోనా కాలంలో ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగించిన ఇంటర్‌ బోర్డు.. సిలబస్‌ తగ్గించి ఎక్కువ చాయిస్‌ ప్రశ్నలతో పరీక్షలు నిర్వహించింది. ఇందులో కేవలం 40 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 60 శాతం మంది ఫెయిల్‌ అయ్యారు. దీంతో పరీక్షల నిర్వహణ.. ఆన్‌లైన్‌ తరగతులతో పాఠాలు అర్థం కాక చాలామంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారని తల్లిదండ్రులు ఆందోళన చేశారు. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ వైఖరితోనే విద్యార్థులకు నష్టం జరిగిందని రాజకీయం చేశాయి. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులను పాస్‌ మార్కులతో పాచేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా తెలిపారు. ఇలా పాస్‌ చేయడం ఇదే చివరిసారని, ఇకపై పాస్‌ చేయడం ఉండదని స్పష్టం చేశారు.

    Telangana Intermediate Board

    -గత పరిస్థితి పునరావృతం కాకుండా..
    గత సెప్టెంబర్‌లో ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఇంటర్‌ బోర్డు అన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సిలబస్‌ను ఇప్పటికే తగ్గించింది. పరీక్షల్లో చాయిస్‌ ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇవి గత సెప్టెంబర్‌లోనూ అమలు చేసినా ఫలితాలు నిరాశ కలిగించాయి. ఈ నేపథ్యంలో ఈసారి మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు పరీక్షలపై భయం పోగొట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే తొలిసారిగా ప్రీ ఫైనల్‌ పరీక్షలకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం సెకండియర్‌ పరీక్షలు రాయబోయేది గత సెప్టెంబర్‌లో పాస్‌ మార్కులతో ఉత్తీర్ణులయిన విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. దీంతో ప్రీ ఫైనల్‌ పరీక్షలతో మెరుగైన ఫలితాలు వస్తాయని విద్యావేత్తలు సూచించారు. ఈ నేపథ్యంలో గత ఏడాది తయారు చేసిన మూడు ప్రశ్న పత్రాల్లో ఒక పేపర్‌ను ఈ ఏడాది ప్రీ ఫైనల్‌ పరీక్షలకు వినియోగించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. ఏప్రిల్‌ మొదటి వారంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రీ ఫైనల్‌ పరీక్షల నిర్వహణకు కార్యచరణ సిద్ధం చేసింది. ఈమేరకు ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.

    Also Read: NTR: హిందీ మార్కెట్  కోసం   ఎన్టీఆర్  కొత్త ప్లాన్ 

    -కొనసాగుతున్న ప్రాక్టికల్స్‌..
    ప్రస్తుతం ఇంటర సెకండియర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈనెల 23న ప్రారంభమైన పరీక్షలు వచ్చే నెల 7వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ పరీక్షల్లోనూ విద్యార్థులు ఫెయిల్‌ కాకుండా ఇంటర్‌ బోర్డు అన్ని చర్యలు తీసుకుంది. దాదాపు అన్ని కాలేజీల విద్యార్థులకు సొంత కళాశాలల్లోనే ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తోంది. దీంతో అన్ని కళాశాలలు తమ విద్యార్థులను ఉత్తీర్ణులు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. గైర్హాజరైతే తప్ప విద్యార్థులు ఫెయిల అయ్యే అవకాశం లేదు. ఈ క్రమంలో రాత పరీక్షల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించాలని ప్రీ ఫైనల్‌కు కార్యచరణ సిద్ధం చేసింది.

    Telangana Intermediate Board

    -2017 నుంచి ప్రభుత్వంపై విమర్శలు..
    ఇంటర్‌ పరీక్షల నిర్వహణలో 2017 నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2017–18 విద్యాసంవత్సరంలో పరీక్షల నిర్వహణ బాధ్యతను మంత్రి కేటీఆర్‌ సన్నిహితుడి సంస్థ అయిన గ్లోబల్‌ ఎరీనాకు అప్పగించారు. అయితే ఆ ఏడాది నిర్వహించిన పరీక్షల్లో చాలామంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. 90 శాతం మార్కులు వస్తాయనుకున్నవారు 35 శాతం మార్కులు వచ్చాయి. ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు ఫెయిల్‌ కావడాన్ని తట్టుకోలేకపోయారు. 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో గ్లోబల్‌ ఎరీనా సంస్థపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కేటీఆర్‌ ప్రోద్బలంతోనే సంస్థ ఇంటర్‌ పరీక్షల నిర్వహణ బాధ్యత చేపట్టి విద్యార్థులను బలి తీసుకుందన్న విమర్శలు వచ్చాయి. తర్వాత రెండేళ్లు కరోనాతో ఇంటర్‌ బోర్డు పరీక్షలు నిర్వహించలేదు. తాజాగా కోవిడ్‌ తర్వాత సెప్టెంబర్‌లో నిర్వహించిన పరీక్షల్లోనూ ఫలితాలు ఆశించిన మేరకు రాలేదు. దీంతో ఈ ఏడాది నిర్వహించే పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకూడదన్న లక్ష్యంలో రాష్ట్ర విద్యాశాఖ, ఇంటర్‌ మీడియెట్‌ బోర్టు కసరత్తు చేస్తున్నాయి. అవసరమైతే రాత పరీక్ష కేంద్రాలను కూడా చాలా వరకు సొంత కళాశాలలకు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.

    Also Read: KCR: కేంద్రం వర్సెస్‌ రాష్ట్రం: ధాన్యం యుద్ధం.. వరి కొయ్యలకు బలయ్యేదెవరో..?

    Tags