తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వభూములను తెగనమ్ముతోంది. భవిష్యత్ తరాలకు ఏమి మిగలకుండా ఎక్కడ దొరికితే అక్కడ ఉన్న భూములను విక్రయించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా తన ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. భూములు అమ్మరాదని బీజేపీ నాయకురాలు విజయశాంతి గత వారం కిందట హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ భూముల అమ్మకానికి మార్గం సుగమం కావడంతో భూములను అమ్ముకుని ఖజానా పెంచుకోవాలని ప్రభుత్వం ఉత్సాహంతో ఉంది. వేలాన్ని అడ్డుకోకుండా ఇప్పటికే సివిల్ కోర్టులో కేవియట్ కూడా వేసింది. ఇక కోకాపేటలో 50 ఎకరాల భూమిని వేలం వేయడానికి అడ్డంకులు తొలగిపోయినట్లే.
కోకాపేట భూములంటే బంగారంతో సమానం. అందుకే వివిధ స్టేట్లకు చెందిన కంపెనీలు అంతర్జాతీయ సంస్థలు కూడా ఆన్ లైన్ బిడ్డింగ్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటి అమ్మకం ద్వారా 5 వేల కోట్ల వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు. అధికారులు ఆన్ లైన్ భూముల వేలాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ చేపడుతోంది. గతంలో ఉప్పల్ భగాయత్ బూముల వేలం కూడా ఇదే సంస్థ నిర్వహించింది.
ఇప్పటికే మూడుసార్లు ఆన్ లైన్ బిడ్డింగ్ ద్వారా భూముల వేలం వేసిన హెచ్ఎండీఏకు మొదటిసారి 350 నుంచి 400 కోట్లు వచ్చాయి. రెండోసారి మూడోసారి కలిపి మొత్తం వెయ్యి కోట్లు రాబట్టింది. అయితే ఇప్పటి వరకూ గృహ నిర్మాణాల కోసం ప్రభుత్వ భూములను వేలం వేసింది. కానీ ఇప్పుడు బడా రియల్ ఎస్టేట్ సంస్థల కోసం అమ్మకాలు జరుపుతోంది. పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. విపక్షాలు సహజంగానే విమర్శలు చేస్తున్నాయి. పేదలకు ఇవ్వాల్సిన స్థలాలను ఖజానా నింపుకోవడానికి వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఆర్థికష్టాల్లో ఉన్నసర్కారుకు ఈ భూమి ఆదుకుంటోంది.