ఓరుగల్లు అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడనుంది. రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా రెండో అతిపెద్ద నగరంగా ఎదిగింది. ఆదాయపరంగా, జనాభా పరంగా ఉమ్మడి వరంగల్ ప్రాంతం హైదరాబాద్ కు దీటుగా ఎదుగుతుంది. ఇప్పటికే 10లక్షల జనాభా దాటిన ఈ ప్రాంతం విద్యా కేంద్రంగా అలవారుతూ అభివృద్ధిపరంగా దూసుకెళుతుంది. ఐటీ రంగంలోనూ కొద్దికొద్దిగా సత్తాచాటుతోంది. దీంతో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కసరత్తులు చేస్తుంది. దీనిలో భాగంగా వరంగల్ జిల్లాలో మెట్రో రైలును ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also Read: కేసీఆర్ ని వాడుకొని రేవంత్ ను దెబ్బకొట్టే ప్లాన్…? కాంగ్రెస్ నేత సరైన స్కెచ్?
ఉద్యమాలకు నిలయంగా ఉన్న వరంగల్ జిల్లాపై సీఎం కేసీఆర్ తొలి నుంచి ఫోకస్ పెట్టారు. జిల్లాను అన్నివిధలా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వరంగల్ జిల్లాలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ ప్రాంతంలో మెట్రో రైలును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రూ. 1400కోట్ల వ్యయంతో జిల్లాలో 15కి.మీ. మేర మెట్రో ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
వరంగల్ జిల్లాలో మెట్రోను ఏర్పాటు చేసేందుకు మహారాష్ట్రకు చెందిన ‘మహా మెట్రో’ ముందుకొచ్చింది. మహారాష్ట్రలోని నాగ్ పూర్, థానే, పూణే, నాసిక్ నగరాల్లో మహా మెట్రో అనుసరించిన విధానంలోనే వరంగల్ నగరంలోనూ మెట్రో ఏర్పాటు చేయనుందని సమాచారం. కాజీపేట నుంచి పెట్రోల్ పంపు.. అక్కడి నుంచి పోచమ్మ మైదాన్.. అక్కడి నుంచి వెంకట్రామ టాకీస్ మీదుగా వరంగల్ రైల్వే స్టేషన్ వరకు మెట్రో ట్రైన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 15కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని మహా మెట్రో నిర్మించనుంది. ఈ ప్రాజెక్టుకు రూ.1400కోట్ల మేర ఖర్చవుతుందని మహా మెట్రో ప్రతినిధులు ప్రాథమికంగా అంచనా వేశారు.
Also Read: కేసీఆర్ తో ఫైట్.. జగన్ తట్టుకుంటాడా?
ఇప్పటికే కోటి రూపాయాలతో మహా మెట్రో సంస్థ జిల్లాలోని నగర ట్రాఫిక్, రవాణా వ్యవస్థ, ప్రజల ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేస్తూ డీపీఆర్‌ను రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మహా మెట్రో ప్రతినిధులు గత డిసెంబర్లో వరంగల్ వచ్చి మెట్రో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసినట్లు సమాచారం. తెలంగాణ సర్కార్ ఓరుగల్లు అభివృద్ధిపై ఫోకస్ పెట్టడంతో త్వరలోనే జిల్లాలో మెట్రో పరుగులు తీయడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ఎప్పటిలోగా పూర్తి చేస్తుందో వేచి చూడాల్సిందే..!