తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా ఉన్నారు. నిన్నటి వరకు పుదుచ్చెరిలో ఉన్న ఆమె.. అత్యవసరంగా హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. ఈ విషయాన్ని తమిళిసై సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘అధికారిక పనుల నిమిత్తం అత్యవసరంగా పుదుచ్చెరి నుంచి హైదరాబాద్ బయలుదేరాను’ అంటూ ట్వీట్ చేశారు గవర్నర్.
దీంతో.. కారణమేంటనే చర్చ మొదలైంది. అంత అత్యవసరంగా గవర్నర్ రావాల్సిన అధికారిక కార్యక్రమాలు తెలంగాణలో ఏమున్నాయనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. అయితే.. చాలా మంది అంచనా వేసిన విషయం ఒక్కటే. అదే.. మంత్రివర్గ విస్తరణ. ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత.. వైద్య ఆరోగ్యశాఖ ఖాళీగా ఉంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మంత్రి నియామకం అనివార్యంగా మారింది.
అయితే.. ఈ శాఖను హరీష్ రావుకు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల కేంద్ర మంత్రితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ఆరోగ్యశాఖ మంత్రి స్థానంలో హరీష్ రావు పాల్గొన్నారు. దీంతో.. కాబోయే హెల్త్ మినిస్టర్ హరీషే అనే ప్రచారం సాగుతోంది. ఇలాంటి సమయంలోనే గవర్నర్ అత్యవసర పని ఉందంటూ పుదుచ్చెరి నుంచి రావడంతో.. హెల్త్ మినిస్టర్ ప్రమాణ స్వీకారానికే వచ్చారని అందరూ అనుకుంటున్నారు.
కానీ.. రాజ్ భవన్ వర్గాలు మాత్రం అలాంటిది ఏమీ లేదని చెబుతున్నాయట. మంత్రివర్గ విస్తరణ గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారమూ రాలేదని అధికారులు చెబుతున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఉన్నందున.. అందులో పాల్గొనడానికే గవర్నర్ వచ్చారని చెబుతున్నారట. దాంతోపాటు మరో వర్చువల్ మీటింగ్ లో పాల్గొంటారని చెబుతున్నట్టు సమాచారం. ఇంతేనా..? మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? అన్నది చూడాలి.