Governor Tamilisai Vs KCR: రాజకీయాల్లో తిమ్మిని బమ్మి.. బమ్మిని తిమ్మి చేయగల నేర్పరి తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ఎంతో అనుభవం, రాజకీయ చతురత ఉన్న ప్రధాని నరేంద్రమోదీని సైతం ఢీకొట్టేందుకు ఒక దశలో సిద్ధమయ్యారు. ఇక రాష్ట్రంలో విపక్షాలు అంటే కేసీఆర్‌కు గడ్డి పరకతో సమానం. ప్రతిపక్ష నేతలను గులాబీ బాస్ అసలు లెక్కలోకే తీసుకోరు. ఇంతటి నేర్పరి అయిన కేసీఆర్‌ను తెలంగాణ గవర్నర్ తమిళిసై తలనొప్పిగా మారారు. టెన్షన్ పెడుతున్నారు. ముఖ్యమంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో కాలికి వేస్తే వేలికి.. వేలికి వేస్తే కాలుకు అన్నట్లుగా రూల్స్‌తో గవర్నర్ కేసీఆర్‌ను దెబ్బకొడుతున్నారు. దీంతో గవర్నర్ ఆమెదం వరకు టెన్షన్ తప్పడం లేదు. గతంలో పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీని చేయాలనుకుంటే గవర్నర్ అడ్డుపడ్డారు. ఇప్పుడు దాసోజు శ్రవణ్‌తో పాటు కుర్రా సత్యనారాయణ అనే బీజేపీ వలస నేతను ఎమ్మెల్సీలను చేద్దామనకున్నా.. గవర్నర్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.
ఆమోదం తప్పనిసరి..
ఇతర కోటా ఎమ్మెల్సీల సంగతి అయితే ఎలాగోలా చూసుకోవచ్చు కానీ.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో మాత్రం గవర్నర్ ఆమోదం తప్పని సరి. దీంతో తమిళిసై అంత సామాన్యంగా ఓకే చేయడం లేదు. సాధారణంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయాలంటే.. వివిధ రంగాల్లో పేరు ప్రతిష్టలు పొందిన వారిని, మేధావులను సిఫారసు చేయాలనే సంప్రదాయం ఉంది. రాజకీయ నేతలకు అవకాశం కల్పించరు. గతంలో పాడి కౌశిక్‌రెడ్డి క్రీడలకు సేవ చేశారన్న కారణం చూపి నామినేట్ చేశారు. అయితే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసులున్నాయన్న కారణంగా గవర్నర్ తిరస్కరించారు. దాంతో ఆయనను కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ చేసి, మాజీ స్పీకర్ మధుసూదనాచారికి గవర్నర్ కోటాలో చాన్స్ ఇచ్చారు. ఆయన పేరును గవర్నర్ వెంటనే ఆమోదించారు.
దాసోజు, కుర్రా ఏ రంగాలకు చెందినవారో..
తాజాగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈమేరకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కానీ గవర్నర్ ఆమోదించలేదు. దాసోజు శ్రవణ్ రాజకీయ నేతగానే అందరికీ పరిచయం. అలాగే కుర్రా సత్యనారాయణ కూడా మాజీ ఎమ్మెల్యే. ఈ కారణాలతో వారి పేర్లను గవర్నర్ ఆమోదించడం లేదని చెబుతున్నారు. ఏ రంగానికి సేవ చేయని, రాజకీయ నేతలను నామినేట్ చేయడంపై గవర్నర్ అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ అవసరాలు తీర్చే వారిని గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలని చూస్తున్నారన్న అభిప్రాయం రాజ్‌భవన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నిజానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పదవీ కాలం ఎప్పుడో పూర్తయింది. కొంత కాలం ఎవర్నీ నియమించకుండా కేసీఆర్ ఆలస్యం చేస్తే.. ఇప్పుడు గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. గవర్నర్‌ను గట్టిగా విమర్శించలేని స్థితి బీఆర్‌ఎస్‌ది. ఎందుకంటే వారి పేర్లను తిరస్కరిస్తే .. ప్రభుత్వం చేయగలిగేదేమీ ఉండదు. మరోసారి సిఫార్సు చేసుకోవాల్సి ఉంటుంది.