
కరోనా ఎఫెక్ట్ బోనాల పండుగపై పడింది. రాష్ట్రంలోని హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ఈసారి బోనాల వేడుకలను రద్దు చేసేందుకే మొగ్గుచూపింది. మంత్రులు, అధికారులతో బోనాల వేడుకల అంశంపై సుదీర్ఘంగా చర్చించి తాజాగా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. ఈసారి ప్రజలంతా ఇళ్లలోనే బోనాలు చేసుకోవాలని సూచింది. ఆలయాల్లో బోనాలు సమర్పించాడని అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
బోనాల వేడుకల రద్దు నిర్ణయంపై మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడారు. కరోనా కేసుల దృష్ట్యా ఈ సంవత్సరం సామూహిక బోనాల వేడుకలను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రజలంతా ఈసారి ఎవరి ఇళ్లలో వారే బోనాల చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆలయాల్లో పూజారులే అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారని తెలిపారు. పూజారులే ఘటాలను ఊరేగిస్తారని.. పట్టువస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను ప్రజలంతా విధిగా పాటించాలని కోరారు.
ఇప్పటికే కరోనా కరోనా కారణంగా ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ పండుగలు కళతప్పిన సంగతి తెల్సిందే. హైదరాబాద్లో ప్రతీయేటా ఘనంగా నిర్వహించే బోనాల పండుగపై తాజాగా ఈ ప్రభావం పడింది. కరోనా ప్రభావం ఇలానే కొనసాగితే వచ్చే దసరా, వినాయక చవితి వేడుకలపై ప్రభావం ఉండబోతుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దసరా వరకు కరోనా కట్టడి అవుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఈ ఏడాది అన్నిపండుగలు కళ తప్పిపోయే ప్రమాదం ఉందని పలువురు వాపోతున్నారు.