Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ న్నికలకు ఇంకా 22 రోజుల సమయం మాత్రమే ఉంది. ఒకవైపు పార్టీలు నామినేషన్లు, ప్రచారంలో బిజిగా ఉన్నాయి. ఇంకోవైపు ఎన్నికల అధికారులు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు, సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలపైనా ఈసీ దృష్టిపెట్టింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. మరోవైపు ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీనిని కట్టడి చేసేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు నామినేషన్ల స్వీకరణలోనూ అధికారులు బిజీగా ఉన్నారు. ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 13వరకు ఉపసంహరణకు అకాశం ఉంది. అదేరోజు బరిలో ఉండేది ఎవరో ఖరారవుతుంది.
ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల స్వీకరణ..
ఇక ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదుకు సీ విజిల్ యాప్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రతీ నియోజకవర్గం నుంచి సగటున వంద చొప్పున ఇప్పటికే ఫిర్యాదు వచ్చాయి. వాటిని పరిష్కరించడంపైనా ఈసీ దృష్టిపెట్టింది. పోలీసులు కూడా నిబంధనలు అతిక్రమించేవారిపై కేసులు పెడుతున్నారు.
వృద్ధులు, వికలాంగులకు ‘12డి’
ఈసారి ఎన్నికల్లో కొత్తగా ఫాం 12డిని ఎన్నికల సంఘం అమలు చేస్తోంది. పోలింగ్ కేంద్రానికి రాలేని వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది. అయితే ఇందుకోసం వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మంగళవారంతో దరఖాస్తు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 12డికి మంచి స్పందన వచ్చింది. చాలా మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజాగా కొత్త రూల్..
ఇదిలా ఉండగా, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసీ కొత్త నిబంధనను అమలులోకి తెచ్చింది. ఓటు వేయలేని వారికి సహాయకుడిగా వచ్చే వారి కుడి చేతి చూపుడు వేలుకు ఇకపై ఇంకు పెట్టాలని నిర్ణయించింది. సహాయంగా వచ్చే వ్యక్తి కూడా అదే బూత్‌కు చెందిన ఓటరై ఉండాలని, అతను ఓటు వేశాకే మరొకరికి సహాయకుడిగా వెళ్లాలని స్పష్టం చేసింది. ఓటు వేసేటప్పుడు ఎడమ చేయి చూపుడు వేలుకు ఇంకు పెడతారని వివరించింది. ఈసారి ఉదయం 5.30 గంటల నుంచే మాక్ పోలింగ్ ప్రారంభిస్తారని, పోలింగ్ ఏజెంట్లుగా సర్పంచ్, వార్డు సభ్యులు కూడా కూర్చోవచ్చునని ఎన్నికల కమిషన్ పేర్కొంది.