Telangana Elections 2023: ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువు.. రాజకీయ చైతన్యానికి చిరునామా.. కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టుతో సరికొత్త అందాలను సంతరించుకుని సుందరంగా రూపుదిద్దుకుంటున్న నగరం కరీంనగర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఉద్యమ గడ్డ కరీంనగర్‌లో గెలుపు ఎవరిదనే చర్చ అంతటా జరుగుతోంది. ఇక్కడి నుంచి మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు పోటీలో ఉన్నారు. బీఆర్‌ఎస్ నుంచి మంత్రి గంగుల కమలాకర్ నాలుగోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. గంగులపై రెంుసార్లు పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్ ఈసారి ఎలాగైనా గంగులను దెబ్బకొట్టాలనుకుంటున్నారు. బీజేపీ టికెట్‌పై బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి రియల్టర్, బొమ్మకల్ మాజీ సర్పంచ్, మాజీ జెడ్పీటీసీ పురుమాళ్ల శ్రీనివాస్ తలపడుతన్నారు.
నియోజకవర్గంలో ఓటర్లు ఇలా..
కరీంనగర్ నియోజకవర్గంలో 3,23,620 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,62,668, మహిళలు 1,60,923, ఇతరులు 29 మంది ఉన్నారు. ఇక సామాజికవర్గాల వారీగా చూస్తే.. నియోజకవర్గంలో 40 వేల మున్నూరు కాపు ఓటర్లు ఉన్నారు. ముస్లిం ఓటర్లు 38 వేల మంది ఉన్నారు. 29, వేల మంది ఎస్సీలు, 22 వేల మంది పద్మశాలీలు, 14 వేల మంది ముదిరాజ్‌లు, 9 వేల మంది గౌడ ఓటర్లు, 8 వేల మంది క్రిస్టియన్లు ఉన్నారు. ఇక్కడ అభ్యర్థి గెలుపోటముల్లో గత మూడు పర్యాయాలుగా మున్నూరు కాపులు, మైనారిటీలు కీలకపాత్ర పోషిస్తున్నారు.
14 సార్లు ఎన్నికలు..
1957లో కరీంనగర్ నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి జువ్వాడి చొక్కారావు గెలిచారు. ఆ తర్వాత 5 సార్లు కాంగ్రెస్ అభ్యర్థే విజయం సాధించారు. ఇక నాలుగు సార్లు టీడీపీ, రెండుసార్లు గులాబీ పార్టీలు ఇక్కడ సత్తా చాటాయి. హ్యాట్రిక్ విజయాలు సాధించిన జువ్వాడి చొక్కారావు అదే తరహాలో మూడుసార్లు మంత్రి పదవి చెపట్టారు. ఎమ్మెస్సార్, ముద్దసాని దామోదర్ రెడ్డి సరసన ప్రస్తుత మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిలిచారు.
గంగుల హ్యాట్రిక్..
2009, 2014, 2018 లో వరుసగా గెలిచి… హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ రికార్డ్ సాధించారు. 2009లో 68738 ఓట్లు, 2014 లో 77,209 ఓట్లు సాధించి గెలుపొందారు. 2018లో మాత్రం గంగుల, బండి సంజయ్‌ల మధ్య పోరు రసవత్తరంగానే సాగింది. గంగులకు 80, 983 ఓట్లు రాగా… బండి సంజయ్‌కి 66, 009 ఓట్లు, పొన్నం ప్రభాకర్‌కు 39,500 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై కేవలం 14,974 ఓట్లతో గంగుల గట్టెక్కారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ నుంచి గంగుల కమలాకర్ బరిలో ఉండగా.. 4వ సారి సమరానికి సై అంటున్నారు. బీజేపీ నుంచి సంజయ్ మళ్లీ బరిలో ఉండగా, కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని మార్చింది. ఈసారి పురుమాళ్ల శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు.
ముగ్గురూ కాపులే..
ఇక కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో జయాపజయాలను నిర్ణయించేంది కాపులు, మైనారిటీలే ఈ రెండు వర్గాలు నియోజకవర్గంలో 80 వేలకుపైగా ఓట్లు ఉన్నాయి. గతంలో రెండు ఎన్నికల్లో వీరే కీలకమయ్యారు. ఈసారి కూడా వీరే నిర్ణేతలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో మూడు పార్టీలు ఈసారి మున్నూరుకాపులనే బరిలో నిలిపాయి. గంగుల కమలాకర్, బండి సంజయ్, పురుమాళ్ల శ్రీనివాస్ ముగ్గురూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు. దీంతో ఈసారి మున్నూరుకాపు ఓట్లు చీలడం కాయంగా కనిపిస్తోంది. 2018లో బండి, గంగుల మధ్య ఈ ఓట్లు చీలగా, ఈసారి ముగ్గురి మధ్య చీలే అవకాశం కనిపిస్తుంది. రూరల్ ఏరియాలో పురుమాళ్ల శ్రీనివాస్‌కు మంచి పట్టు ఉంది. గ్రామీణ ఓట్లు ఎక్కువగా గత రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు వచ్చాయి. దీంతో ఈసారి ఈ ఓట్లు చీలితే గంగుల గెలుపు అవకాశాలు తగ్గుతాయంటున్నారు. మరోవైపు బీజేపీకి నగరం అండగా నిలుస్తుంది. నగరంలో మెజారిటీ ఓటర్లు బీజేపీకి మొగ్గు చూపుతున్నారు. పురుమాళ్ల శ్రీనవాస్‌కు కూడా ఈసారి నగరం ఓట్లు పడే అవకాశం ఉంది.
గంగులతోపాటు, అధికారపార్టీ బలాలు
ఆర్థికంగా బలమైన నేత…
మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ల సంఖ్య 21
ఇందులో అధికార పార్టీ కార్పొరేటర్లు 19 గంగుల ప్రధాన బలం
ప్రత్యమ్నాయా ప్రతిపక్షాలు లేకపోవటం
నిత్యం ప్రజలతో మమేకం
బలమైన క్యాడర్.
బలహీనతలు
నిత్యం ఆయన్ని అంటిపెట్టుకుని ఉండే కోటరీ.
ప్రజలు ఆయనని నేరుగా కలిసే అవకాశం లేకపోవటం.
తన సామాజికవర్గాన్ని మాత్రమే ఎక్కువగా ప్రోత్సహిస్తారన్న అపవాదు.
రూరల్, అర్బన్ నేతల కబ్జా ఆరోపణలు, అవినీతి ఆరోపణలు.
మునిసిపల్ కార్పొరేషన్‌లో కమీషన్ల కక్కుర్తిపై ఆరోపణలు.
బొమ్మకల్, కొత్తపల్లితో వంటి మేజర్ ప్రాంతాల్లోని కీలక నేతలతో ఈమధ్య సయోధ్య చెడటం.
కులుపుకోవాలని చూసినా నివురుగప్పిన నిప్పులాగే కొనసాగుతున్న సంబంధాలు.
ఎంఐఎం నేతలు పూర్తిగా వ్యతిరేకమవ్వటం.
చేసిన పనులు..
కరీంనగర్ సిటీలో 14 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి.
ఐటీ టవర్ నిర్మాణం.
234 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం.
600 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులు.
మెడికల్ కళాశాల మంజూరు.
టీటీడీ దేవాలయం.
కరీంనగర్ చుట్టూ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివద్ధి, కొత్తపల్లి వద్ద కాకతీయ కాలువకు ప్రత్యేకంగా తూము
ఏర్పాటు చేయించి 13 వేల ఎకరాలకు సాగునీరు అందించడం, బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు, ఏటా కరీంనగర్
మున్సిపాలిటీకి 100 కోట్ల నిధులు వచ్చేలా మూడేళ్ల నుంచి మంజూరు చేయించుకోవడం… స్మార్ట్ సిటీ,
ఐలాండ్ లతో సుందరంగా నగరాన్ని తీర్చిదిద్దడం వంటివి ప్లస్.
చేయని పనులు..
24 గంటల నీటి సరఫరా
విలీన గ్రామాల సమస్య
డంప్ యార్డ్ ప్రధాన సమస్య
ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయలేకపోవడం
నగరంలో పార్కింగ్ సమస్య
నూతనంగా గొప్పగా చెప్పుకున్న కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్స్ కుంగిపోవడం
రక్షణ వాల్స్‌కు బీటలు రావడం
అధ్వానంగా అంతర్గత రోడ్ల పరిస్థితి
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి కానీ దుస్థితి
డబుల్ బెడ్ రూమ్ హామీ నెరవేర్చలేకపోవటం
బండి సంజయ్ బలం..
– రెండుసార్లు ఓడిపోయారన్న సానుభూతి
– 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌పై 89508 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
– ఎంపీగా కేంద్రం నుంచి స్మార్ట్‌సిటీకి నిధులు తీసుకురావడం
– తీగలగుట్టపల్లి ఫ్లై ఓవర్ వంతెన మంజూరు చేయించి పనులు ప్రారంభించడం
– హిందూ ఏక్తా యాత్ర హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తూ 80% ఉన్న హిందువుల కోసం తమ పోరాటం అంటూ సెన్సేషనల్ కామెంట్ చేస్తూ ముందుకు సాగుతుంటారు.
– యూత్‌లో యమ క్రేజ్ సంపాదించుకున్నారు.
పురుమాళ్ల శ్రీనివాస్..
– మున్నూరు కాపు సామాజికవర్గం కావడం
– గ్రామీణ ప్రాంతంపై మంచి పట్టు ఉండడం
– రియల్టర్‌గా అందరితో సత్సంబంధాలు కలిగి ఉండడం
– సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీ టీసీగా పనిచేసిన రాజకీయ అనుభవం
– ఆర్థికంగా బలంగా ఉండడం.