Telangana Elections 2023: తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను ప్రకటించింది. బీ ఫారాలు కూడా అందజేసింది. ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నది. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మొదటి దఫా అభ్యర్థులను ప్రకటించింది. ఏకంగా రాహుల్ గాంధీతో గత రెండు రోజుల నుంచి ప్రచారాలు నిర్వహిస్తోంది. భారతీయ జనతా పార్టీ కూడా మొదటి దఫా అభ్యర్థులను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. అభ్యర్థులను ప్రకటించి, ప్రచారం జోరుగా చేస్తున్న నేపథ్యంలో మూడోసారి అధికారంలోకి వస్తామని భారత రాష్ట్ర సమితి పార్టీ భావిస్తోంది. ఎలాగైనా తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ కలలు కంటోంది. అద్భుతం చేసి అధికారాన్ని దక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇన్ని పరిణామాల నేపథ్యంలో అధికారంలోకి ఎవరు వస్తారు? ఎవరు పరాజితులుగా మిగిలిపోతారు? అనే విషయాలపై “సీ ఓటర్” సంస్థ సర్వే నిర్వహించింది.
ఇప్పటివరకు సర్వే సంస్థలు నిర్వహించిన వాటిల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చేశాయి. తాజాగా మరో ప్రముఖ సంస్థ ” ఇండియా టుడే _ సీ ఓటర్” కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రకటించింది. ఈ సర్వే తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆ సంస్థ నిర్వహించిన సర్వే ఒకరకంగా అధికార భారత రాష్ట్ర సమితికి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి ఏ మాత్రం పుంజుకున్నప్పటికీ ప్రభావం ఉండబోదని ఆ సర్వే ప్రకటించింది. ఇండియా టుడే_ సీ ఓటర్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ 54 సీట్లు, భారత రాష్ట్ర సమితి 49 సీట్లు, భారతీయ జనతా పార్టీ 8 సీట్లు గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 39 శాతం ఓట్లు, భారత రాష్ట్ర సమితి 38% ఓట్లు సాధించే అవకాశం ఉంది.
ఇక ఈ సర్వే వెలుపరించిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి మధ్య నువ్వా నేనా అనే విధంగా పోటీ ఉందని తెలుస్తోంది. కెసిఆర్ పాలనపట్ల ప్రజలు విసుగు చెందుతున్నారని ఈ సర్వే సంస్థ పరిశీలనలో తేలింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పని తీరును ఒకసారి చూడాలని ఓటర్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సి ఓటర్ వెలువరించిన ఫలితాలతో గులాబీ శ్రేణులు ఒక్కసారిగా ఢీలా పడ్డాయని తెలుస్తోంది. శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయం పార్టీ ముఖ్యులతో కేసీఆర్ సమావేశం అవుతారని తెలుస్తోంది. ఇప్పటివరకు సొంత సంస్థలతోనే కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలోకి వస్తుందని సర్వే చేయించిందని విమర్శలు చేసిన భారత రాష్ట్ర సమితి నాయకులు.. తాజా సర్వే పై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.