Homeజాతీయ వార్తలుTelangana Elections 2023: ఆ మంత్రులకు ఓటమి తప్పదా?

Telangana Elections 2023: ఆ మంత్రులకు ఓటమి తప్పదా?

Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చాయి. ఆదివారం నాటికి ఎవరు అధికారంలోకి వస్తారని తేలుతుంది. కానీ మెజారిటీ సర్వే సంస్థలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రకటించాయి. సహజంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా సంబరాలు జరుపుకోవాలని శ్రేణులకు సూచించారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని చెబుతున్నారు. సరే ఎగ్జిట్ పోల్స్ వారి పార్టీకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆయన అలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. కానీ ఈ సమయంలో ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కొన్ని కీలక విషయాలు వెల్లడించాయి. ఇందులో కొందరు మంత్రులు ఓడిపోయే అవకాశం ఉందని కుండబద్దలు కొట్టాయి.

వారు ఎవరంటే

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సబితా ఇంద్రారెడ్డి తన సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీరాములు యాదవ్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. ఈ స్థానంలో అనూహ్యమైన ఫలితం రావచ్చని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2018 లో ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేశారు. అప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె భారత రాష్ట్ర సమితిలోకి వెళ్లిపోయారు.
ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్ స్థానం నుంచి శ్రీనివాస్ గౌడ్ పోటీ చేస్తున్నారు. గత రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి నుంచి ఈయన గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఈ స్థానంలో కూడా అనూహ్యమైన ఫలితం రావచ్చని పలు సంస్థలు చెబుతున్నాయి. శ్రీనివాస్ గౌడ్ సోదరుడు ఈ జిల్లాలో పలు వివాదాల్లో తల దూర్చారని తెలుస్తోంది. అదే మంత్రికి ప్రతి బంధకంగా మారిందని అక్కడి ప్రజలు అంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దయాకర్ రావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈయన స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారని.. అద్భుతం జరిగితే తప్ప ఆయన గెలిచే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పలు పోల్ సంస్థలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. అయితే తన రాజకీయ ఆరంగేట్రం నుంచి ఇప్పటివరకు ఓటమి అనేది లేని ఎమ్మెల్యేగా దయాకర్ రావుకు పేరు ఉంది. పైగా అంతటి తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆయన టిడిపి ఎమ్మెల్యేగా, ఎంపీగా విజయం సాధించారు.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన భారత రాష్ట్ర సమితిలోకి వెళ్లారు..
ఇక నిర్మల్ స్థానం నుంచి పోటీ చేస్తున్న దేవాదాయ శాఖ మంత్రి, భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఆల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక బిజెపి అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కూడా అనుహ్యమైన ఫలితం వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి నుంచి పోటీ చేస్తున్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా తన సమీప ప్రత్యర్ధి నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కూడా అనూహ్యమైన ఫలితం వచ్చేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ మంత్రులు కూడా

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కూడా తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కూడా అనూహ్యమైన ఫలితం వచ్చేందుకు ఆస్కారం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఖమ్మం నియోజకవర్గాన్ని చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నట్టు సమాచారం. ఇక్కడ కూడా అనూహ్యమైన ఫలితం వస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా ఇదే విషయాన్ని ప్రకటించాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఆర్ అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా తమ ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నట్టు సమాచారం. ఈ స్థానాల్లో కూడా అనూహ్యమైన ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం ఉందని తెలుస్తోంది. అయితే నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయిన నేపథ్యంలో మంత్రులంతా తమ అనుచరులతో సమావేశం అయ్యారు. పోలింగ్ కు సంబంధించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version