Kantha Rao Rega: పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని అన్ని సంస్థలు చెబుతున్నాయి. సరే ఎగ్జిట్ పోల్స్ అంటే కొంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. నిజమని చెప్పలేం. అలాగని అబద్ధమని కొట్టి పారేయలేం. కాకపోతే వీటి మీద మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వీటిని నమ్మలేమని కొట్టి పారేశారు. సరే ఇదంతా ఓకే అయితే నిన్న పోలింగ్ జరిగిన సమయంలో అధికార పార్టీ నాయకులు చేసిన హడావిడి అంతా కాదు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. భారత రాష్ట్ర సమితికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గయ్య కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సహనం కోల్పోయారు
కవిత, దుర్గయ్య ఉదంతాలు మరువకముందే మరో ఎమ్మెల్యే అభ్యర్థి చేసిన హడావిడి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పినపాక భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థి రేగ కాంతారావు అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక దశలో కాలికి ఉన్న చెప్పును తీసి వారిని కొట్టే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు రేగా కాంతారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఫలితంగా అక్కడ పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులను వారు దూరంగా వెళ్లగొట్టారు. కాంతారావును పోలింగ్ కేంద్రంలోకి తీసుకొచ్చారు.
ఇదేనా పద్ధతి?
రేగా కాంతారావు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లుకుంటూ ఒక కీలక పోలీస్ అధికారికి ఫోన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్ను అడ్డుకుంటుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. ఇదేనా మీ పోలీసింగ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. కాగా, రేగా కాంతారావు వ్యాఖ్యల పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓడిపోతాడు కాబట్టే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదకు చెప్పుతీసాడని, మొయినాబాద్ ఫామ్ హౌస్ ఆర్టిస్ట్ అని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందోనని వారు అంటున్నారు. ప్రస్తుతం రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదకు దూసుకెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.