Telangana Elections 2023: తెలంగాణలో కౌంటింగ్ ప్రక్రియ మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది. అక్కడ ఫలితాలపై ఏపీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అక్కడి ఫలితాలను బట్టి ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. ఈ తరుణంలో తుది ఫలితాలపై రకరకాల చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే.. టిడిపి, జనసేన, వైసీపీ విషయంలో తీసుకునే స్టాండ్ పై రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి.
ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటుందన్న చర్చ నడుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో టిడిపి పోటీకి దూరంగా ఉంది. ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. కానీ టిడిపి శ్రేణులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. బాహాటంగా మద్దతు తెలిపాయి. అయితే ఇప్పుడు గానీ కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే.. ఏపీలో తమ గెలుపు పక్కా అని తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్కు అనుకూల ఫలితాలు వస్తే మాత్రం చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే అంత తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు.
అయితే అటు కాంగ్రెస్, ఇటు బిజెపి ఏపీ విషయంలో ఎటువంటి స్టాండ్ తీసుకుంటాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ చంద్రబాబుకు స్నేహ హస్తం అందిస్తుందా? అందుకు పవన్ ఒప్పుకుంటారా? అన్నది ఒక రకమైన ప్రశ్న. పోనీ కాంగ్రెస్ వైసీపీతో చెలిమి చేస్తుందా? అది సాధ్యమేనా? అన్నది మరో ప్రశ్న. అయితే ఈపాటికే ఏపీ సీఎం జగన్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.
ఇక బిజెపి విషయానికి వస్తే టిడిపి, జనసేన కూటమిలో ఆ పార్టీ చేరుతుందా? అందుకు చంద్రబాబు సమ్మతిస్తారా? ఈ మూడు పార్టీలు కలిస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని సర్వేల్లో వెల్లడైంది.లేకుంటే జనసేనతో మాత్రమే బిజెపి జతకడుతుందా? అందుకు పవన్ సిద్ధంగా ఉన్నారా? అంటే దానికి కూడా సమాధానం దొరకడం లేదు. ఎందుకంటే ఆరు నూరైనా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో మాత్రమే జత కడతానని పవన్ తేల్చి చెప్పారు. ఏపీ ప్రజల కోసం ఈ పొత్తు కీలకమైన విషయాన్ని గుర్తు చేశారు. పోనీ వైసిపితో బిజెపి జతకట్టే అవకాశం ఉందా? అది సాధ్యం కాదని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఎలా చూసుకున్నా తెలంగాణ ఫలితాలు ఏపీ పై పెను ప్రభావం చూపనున్నాయి.