Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు 2014, 2018లో ఎన్నికలు జరిగాయి. 2023 ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. కౌంటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అత్యధికసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు అన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు చెందిన సీనియర్ నేతలు 5 కన్నా ఎక్కువసార్లు విజయం సాధించారు. వీరి సంఖ్య 45 వరకు ఉంది.
కేసీఆర్, జానారెడ్డి, ఈటల ఏడుసార్లు..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికి ఎనిమిదిసార్లు శాసనసభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆయన తర్వాత ఏడుసార్లు శాసనసభకు ఎన్నికైన వారు ఇద్దరు ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి , ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ ఈ ఘనత పొందారు. జానారెడ్డి 1983,1985లో టీడీపీ తరఫున, 1989,1999,2004,2009,2014లలో కాంగ్రెస్ పక్షాన గెలుపొందారు. ఈటల రాజేందర్ 2004 ,2008 ఉప ఎన్నిక, 2009, 2010 ఉప ఎన్నిక, 2014,2 018లలో టీఆర్‌ఎస్ పక్షాన, 2021 ఉప ఎన్నికలో బీజేపీ తరఫున విజయం సాధించారు. కేసీఆర్ కూడా మూడుసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఆరుసార్లు వీరే..
ఇక ఆరుసార్లు గెలిచినవారిలో జి.గడ్డెన్న, టీ.జీవన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సి.రాజేశ్వరరావు, తన్నీరు హరీశ్‌రావు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, ముంతాజ్ అహ్మద్ ఖాన్, నర్రా రాఘవరెడ్డి ఉన్నారు.
ఐదుసార్లు గెలిచింది వీరే..
ఇక ఐదుసార్లు గెలిచిన నేతలలో జి.రాజారాం, గంపా గోవర్ధన్, మండవ వెంకటేశ్వరరావు, కరణం రామచంద్రరావు, సి.విఠల్‌రెడ్డి, కె.హరీశ్వర్‌రెడ్డి, పి.జనార్ధనరెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, దానం నాగేందర్, అక్బరుద్దీన్ ఒవైసీ, సలావుద్దీన్ ఒవైసీ, అమానుల్లాఖాన్, జి.సాయన్న, డాక్టర్ పి.శంకరరావు, గురునాధరెడ్డి, జె.కృష్ణారావు, ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పి.గోవర్దనరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉన్నారు.
ప్రస్తుతం రేసులో వీరే..
ఐదుకన్నా ఎక్కువసార్లు గెలిచిన వారిలో ప్రస్తుతం కూడా కొందరు బరిలో ఉన్నారు. వారిలో కేసీఆర్, ఈటల రాజేందర్, జీవన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఇందులో ముగ్గురు సీఎం అభ్యర్థులే కావడం గమనార్హం. కేసీఆర్ ఇప్పటికే ముఖ్యమంత్రి. బీఆర్‌ఎస్ మళ్లీ మెజారిటీ వస్తే మళ్లీ సీఎం కావడం ఖాయం. ఇక కాంగ్రెస్ గెలిస్తే సీఎం రేసులో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఉన్నారు. బీజేపీ కింగ్ మేకర్ అయితే ఈటల రాజేందర్ కూడా సీఎం రేసులో ఉంటారు.