TRS State Executive Committee Meeting: పాలనలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ సీఎం కేసీఆర్ ముందుకెళుతున్నారు. దళితబంధు అమలు.. హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా సంక్షేమ పథకాల వర్షం, ఇక తెలంగాణ విద్యావ్యవస్థను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పాలనను పట్టాలెక్కిస్తున్న కేసీఆర్ ఇప్పుడు పార్టీపై ఫోకస్ చేశారు.
ఈ క్రమంలోనే మంగళవారం సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించ తలపెట్టారు. ఇటీవలే పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియను టీఆర్ఎస్ పార్టీ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్, పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో సంస్థాగత నిర్మాణం, హుజూరాబాద్ ఉప ఎన్నికల అంశాలపై చర్చించనున్నారు.
ప్రధానంగా హుజూరాబాద్ లో గెలుపు.. దళితబంధు పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై శ్రేణులకు కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు. దళితబంధు పథకం అమలులో పార్టీ శ్రేణుల బాధ్యతలేమిటి? విపక్షాల ప్రచారాన్ని ఎలా తిప్పి కొట్టాలనే అంశంపై శ్రేణులకు దిశానిర్ధేశం చేయనున్నట్లు సమాచారం.
ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఈరోజు మీటింగ్లో పార్టీ పునర్మిర్మాణంపై ఫోకస్ చేసినట్టు సమాచారం. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర శాఖల పునర్నిర్మాణంపై దృష్టి సారించినట్లు తెలిసింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలు తీరుతెన్నులు, పార్టీ అనుసంరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన కృషిపై సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు ఈరోజు దిశానిర్ధేశం చేస్తున్నారు. దళితబంధు ప్రాధాన్యతలు, పథకం రూపకల్పన వెనుక ఉద్దేశాలను కేసీఆర్ వివరించనున్నారు.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంధానకర్తగా పార్టీ శ్రేణులు ఎలా పనిచేయాలో అధినేత వెల్లడించనున్నట్లు తెలిసింది. ఈ మీటింగ్ తర్వాత కీలక ప్రకటను కేసీఆర్ ను వెలువడనున్నట్టు సమాచారం.