
తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు మే 7తో ముగియనుంది. లాక్ డౌన్ నేపథ్యంలో మంత్రులు మూడోసారి భేటీ కానున్న నేపథ్యంలో.. లాక్ డౌన్ కొనసాగింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీ జరుగనుంది. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లను ప్రకటించిన కేంద్రం.. రెడ్ జోన్ మినహా మిగతా జోన్లకు కొన్ని సడలింపులు ఇచ్చింది. సీఎం కేసీఆర్ గ్రీన్, ఆరెంజ్ జోన్లకు సడలింపులు పై చర్చ నడుస్తోంది. కేసీఆర్ కూడా మే 17 వరకు లాక్ డౌన్ పొడిగిస్తారా? లేక మే నెల ముగింపు వరకు పొడిగిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే, పొరుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభం కావడం రాష్ట్ర సర్కారును ఇబ్బంది పెడుతోంది. రాష్ట్ర సరిహద్దులకు దగ్గరగా ఉన్న తెలంగాణ వాసులు.. పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మద్యం కొనుక్కుంటున్న పరిస్థితి నెలకొంది. దీనిపై కేబినెట్‌లో ప్రధానంగా చర్చించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నూతన సమగ్ర వ్యవసాయ విధానం, నీటిపారుదల, గ్రీన్ జోన్ల పరిధిలో పరిశ్రమలు అనుమతులతో సహా ఇతర అంశాలు చర్చించనున్నారు.
మరోవైపు వ్యవసాయ రంగంపై ఏర్పాటు చేసిన కమిటీ ఈ రోజు నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదికను బట్టి ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోళ్లు సహా వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారు. ప్రజల ఆహార అవసరాలకు తగినట్లు, మార్కెట్ లో డిమాండ్ కలిగిన పంటలను సాగు చేసేందుకు రైతులను అవసరమైన సూచనలు, సలహాలపైనా చర్చించనుంది. కాగా, టెన్త్, ఎంసెట్, సెట్ పరీక్షల నిర్వహణపైనా నిర్ణయం తీసుకోనున్నారు.