Telangana Cabinet : ఈసాకి కచ్చితంగా జరుగుతుంది అనుకున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మళ్లీ వాయిదా పడే అవకాశాలే ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త మంత్రుల ఎంపిక విషయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 3న విస్తరణ జరుగుతుందని అందరూ ఊహించినప్పటికీ, చివరి నిమిషంలో ఢిల్లీ నుంచి కొత్త ట్విస్ట్‌లు తెరపైకి వచ్చాయి. మంత్రుల జాబితా ఖరారైనట్లు పార్టీ ముఖ్య నేతలు భావించినా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) కొన్ని పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిస్థితి మారింది. దీంతో, కొత్త జాబితా కోసం పార్టీ నేతలు మళ్లీ కసరత్తు ప్రారంభించారు, మరో ఇద్దరి పేర్లు చర్చలోకి వచ్చాయి.
Also Read : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: ‘కొండా’ఔట్, రేవంత్ కొత్త టీమ్ రెడీ!
ఆరు స్థానాలు ఖాళీ..
రాష్ట్ర కేబినెట్‌లో ఆరు స్థానాలు ఖాళీగా ఉండగా, సామాజిక, ప్రాంతీయ సమీకరణల ఆధారంగా నలుగురిని ఎంపిక చేసేందుకు గత నెలలో ఢిల్లీ(Delhi)లో నిర్ణయం జరిగింది. ఉగాది(Ugadi) సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) గవర్నర్‌తో సమావేశంలో కూడా విస్తరణ గురించి సూచనలు ఇచ్చారు. కానీ, రాహుల్ గాంధీ కొమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komati reddy Rajagopal Reddy) పేరుపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పటికే కొమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండగా, ఆయన సోదరుడికి మరోసారి అవకాశం ఇవ్వడం ఎందుకని రాహుల్ ఆరా తీశారు. అయితే, రాజగోపాల్‌కు పార్టీలో చేరినప్పుడే మంత్రి పదవి హామీ ఇచ్చామని నేతలు వివరించినప్పటికీ, తుది నిర్ణయం కోసం వేచి చూడాలని రాహుల్ సూచించినట్లు తెలుస్తోంది.
జానారెడ్డి లేఖ..
ఇదిలా ఉంటే.. సీనియర్ నేత జానారెడ్డి(JanaReddy) హైకమాండ్‌కు రాసిన లేఖ సంచలనంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్(Hyderabad) జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని, వాటికి అవకాశం కల్పించాలని ఆయన కోరారు. సామాజికవర్గాల వారీగా కూడా పలువురు నేతలు ఢిల్లీలో లాబీయింగ్‌ను తీవ్రతరం చేశారు. ఇప్పటివరకు సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వట్టిక శ్రీహరి, వివేక్ పేర్లు ఖరారైనట్లు ప్రచారం జరిగినా, రాహుల్ అభ్యంతరంతో ఈ జాబితాలో మార్పులు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి.
విస్తరణ అనుమానమే..
సీనియర్లు, సామాజిక అంశాలు, జిల్లాల ప్రాతినిధ్యం వంటి అంశాలు తెరపైకి రావడంతో ఈ నెల 3న విస్తరణ జరగడం అనుమానంగా మారింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో, ఈ రోజు మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో కీలక నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది.
Also Read : తెలంగాణ క్యాబినెట్ విస్తరణ.. కొత్తగా నలుగురికి ఛాన్స్.. రేసులో వీరు..!