Telangana Budget Agriculture: భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రైతులు.. ఈ క్రమంలో వారిని ఆకట్టుకునేందుకు ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తుంది. ఇదే సమయంలో రుణమాఫీ అనే అంశాన్ని పక్కన పెట్టింది.. దీంతో రైతుల్లో కొంతమేర అసంతృప్తి, ఆగ్రహం ఉన్నాయి.. ఈ క్రమంలో వారి ఆవేదనను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈసారి వ్యవసాయానికి భారీ కేటాయింపులు జరిగింది.. ఏకంగా 26,831 కోట్లు ఇచ్చేసింది.. ఇందులో రుణమాఫీ పథకానికి 6,385 కోట్లు, రైతుబంధుకు 15,075, రైతు బీమా కి 1,5 89 కోట్లు, ఆయిల్ ఫామ్ సాగుకు 1000 కోట్లు కేటాయించారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు పదేళ్లలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అప్పటి ప్రభుత్వాలు 7994 కోట్లు ఖర్చు చేశాయని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2023 జనవరి నాటికి కేసీఆర్ ప్రభుత్వం 1,91, 612 కోట్లు వెచ్చించిందని ప్రకటించారు. దేశ వ్యవసాయ వృద్ధిరేటు నాలుగు శాతం కాగా.. తెలంగాణలో అది 7.4% గా ఉందని ప్రకటించారు. 2014_ 15లో రాష్ట్రంలో మొత్తం పంట సాగు విస్తీర్ణం 131.33 లక్షల ఎకరాలు కాగా.. ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ అభివృద్ధి చర్యల వల్ల సాగు విస్తీర్ణం 2020_21 నాటికి 215.37 లక్షల ఎకరాలకు చేరిందన్నారు. రాష్ట్రంలో వరి ఉత్పత్తి మూడు రెట్లు పెరిగిందని తెలిపారు. 2014_ 15లో 68. 17 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2021_ 22లో రెండు కోట్ల రెండు లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందన్నారు.
75 ఏళ్ల భారతదేశ చరిత్రలో 65 లక్షల మంది రైతులకు 65 వేల కోట్ల భారీ మొత్తాన్ని పంట పెట్టుబడి సాయంగా అందించిన ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని హరీష్ రావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి అన్నారు. రైతు బీమా పథకం రైతుల కుటుంబాలకు ఎనలేని ధీమా అందిస్తోందని వెల్లడించారు.
ఏ రైతైనా మరణిస్తే మరణించిన నాటి నుంచి పది రోజుల్లోగా 5 లక్షల బీమా సొమ్మును ప్రభుత్వం అతని కుటుంబానికి అందజేస్తుందని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు లక్ష మంది రైతుల కుటుంబాలకు రైతుబంధు ద్వారా 5384 కోట్లు ఆర్థిక సాయం అందజేశామని ప్రకటించారు.. ఆయిల్ ఫామ్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, దీని సాగు ద్వారా ప్రతి ఎకరానికి 1,50,000 వరకు నికర ఆదాయం వస్తుందన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణాన్ని 20 లక్షల ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.