Contract Jobs Regularisation: ఎన్నాళ్ళ గానో ఎదురుచూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి బడ్జెట్లో ఆర్థిక మంత్రి హరీష్ రావు శుభవార్త వినిపించారు. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీస్ లను క్రమబద్ధీకరణ చేస్తున్నట్టు ప్రకటించారు. సెర్ఫ్ ఉద్యోగులకు పే స్కేల్ సవరణ చేయబోతున్నామని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం నిధులలో కోతులు పెడుతూ, అనేక ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నప్పటికీ… రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాల విషయంలో ఏనాడూ వెనుకంజ వేయలేదని హరీష్ రావు స్పష్టం చేశారు.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు కొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని తీసుకురాబోతున్నామని హరీష్ రావు ప్రకటించారు. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఇందులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు, ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వాములు చేస్తామన్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రకటిస్తామని హరీష్ రావు ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరణకు సంబంధించి గతంలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులు అసహనం పెరిగిపోతోంది.. ఈ క్రమంలో వారిలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రభుత్వం బడ్జెట్ సాక్షిగా క్రమబద్ధీకరణకు పచ్చ జెండా ఊపింది.
ఇంకా పల్లె ప్రగతి నిధులతో పాటు ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా స్థానిక సంస్థల ఖాతాలకు నేరుగా బదిలీ చేయాలని సీఎం నిర్ణయించినట్లు హరీష్ రావు తెలిపారు. ఈ సంస్కరణ వల్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఫైనాన్స్, ట్రెజరీల ఆమోదం కోసం వేచి చూడకుండా, స్వతంత్రంగా నిధులు వినియోగించుకునే అవకాశం కలుగుతుందన్నారు.

అయితే 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం నేరుగా స్థానిక సంస్థల ఖాతాలో బదిలీ చేయడంతో.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇతర అవసరాలకు మళ్ళించింది. దీంతో సర్పంచ్ ల నెత్తిన ఆర్థిక భారం పడింది. ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ఫలితం లేకపోవడంతో చాలామంది సర్పంచులు భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేశారు. మొన్నటికి మొన్న నిజామాబాద్ జిల్లాలో కలెక్టరేట్ ఎదుట ఓ సర్పంచ్ ఆత్మహత్యకు యత్నించాడు. పైగా అధికార పార్టీ సర్పంచుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థలకు నేరుగా నిధులు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది