
అటు దుబ్బాక.. ఇటు జీహెచ్‌ఎంసీలో బీజేపీ సత్తాచాటి తన పరపతిని పెంచుకుంది. ఇక తెలంగాణలో తమదే ఆధిపత్యం అని వారు కిందా మీదా పడి ప్రకటనలు చేస్తున్నారు. కానీ.. ఇప్పుడు వారు ఎమ్మెల్సీ ఎన్నికల బారిన పడ్డారు. మళ్లీ అట్టడుగుకు చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు కళ్లు మూసుకుని కమలం గుర్తుకు గుద్దేస్తారని.. పీవీ కుమార్తె కాదు కదా సీఎం కేసీఆర్ నిలబడినా గెలిచేస్తామని ఊగిపోయారు. కానీ.. ఇప్పుడు ఫలితాలు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తున్నాయి. బీజేపీది బలుపు కాదు వాపు అని ఇతర పక్షాలు విమర్శించడానికి ఎమ్మెల్సీ ఎన్నికలు గొప్ప అవకాశంగా మారిపోయాయి.
Also Read: బీసీలకే ప్రాధాన్యం ఇస్తే.. బీసీ ఓట్లు ఎందుకు పడలే బాబు గారూ..!
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఐదో స్థానంలో ఉన్నారు. అంటే ఆయనను ఓటర్లు అసలు పరిగణనలోకి తీసుకోలేదని అర్థం. ఇక్కడ ప్రేమేందర్ రెడ్డి అంటే బీజేపీనే. ఇంతకుముందు ఎవరికీ పెద్దగా పరిచయం లేని నేత ఆయన. ఒక్క బీజేపీ అనే బ్రాండ్‌ను నమ్ముకునే రంగంలోకి దిగారు. కానీ.. అసలు రేసులోనే లేరు. ఇక హైదరాబాద్ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావు కూడా పరాజయం బాట పట్టారు. ఈ స్థానంలో కేసీఆర్ పోటీ చేసినా గెలుస్తానని ఆయన బీరాలు పోయారు.
బీజేపీకి ఎలాంటి హవా లేనప్పుడే గెలిచానని.. ఇప్పుడు అంతా బీజేపీమయమని.. ఎందుకు గెలవనని ఆయన ధీమాతో ఉన్నారు. కానీ.. అక్కడా టీఆర్ఎస్సే ఆధిక్యంలో కొనసాగుతోంది. చివరికి తానే గెలుస్తానని ఆయన మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు కానీ.. గ్యాప్ పెరిగిపోతూనే ఉంది. ఆయన అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయి. తెలంగాణ బీజేపీలో ఇప్పుడు సాగర్ సమరం ఎదురుగా ఉంది. గత ఎన్నికల్లో రెండు అంటే రెండు వేల ఓట్లు మాత్రమే తెచ్చుకున్నసాగర్‌లో ఇప్పుడు కనీస ప్రభావం చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: జగన్ మార్క్ పాలిటిక్స్.. నోరెత్తని వారికే పదవులు..
సాగర్ టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. జానారెడ్డి దశాబ్దాల పాటు గెలిచిన గడ్డ. బీజేపీకి అభ్యర్థి లేరు. నిన్నటి వరకూ ఆ పార్టీ తరపున పోటీకి కొంత మంది పోటీ పడ్డారు. కానీ.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత.. ప్రజల్లో బీజేపీ పట్ల అంత మేనియా లేదని క్లారిటీ వచ్చేసింది. దీంతో పోటీకి ఎవరూ సాహసించడం లేదు. దీంతో బీజేపీకి సాగర్ వేదికగా పోటీ ఎదురుకాబోతోంది. అక్కడ గెలవడం కాదు.. కనీస ప్రభావం చూపించాల్సి పరిస్థితి వచ్చింది. ఒకవేళ అక్కడ కానీ పార్టీ సత్తా చాటకుంటే మళ్లీ గతంలోకి వెళ్లిపోవడం గ్యారంటీ. ఇక అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కానీ.. ఆ పార్టీ నేతలు కానీ మాట్లాడడానికి కూడా ఏమీ ఉండదు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్