Telangana Assembly Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి నెలకొంది. అభ్యర్థుల ఎంపిక, ప్రచారపర్వాలతో ప్రధాన రాజకీయ పార్టీలు బిజీబిజీగా ఉంటున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది ? అధికారం ఎవరిది ? తదితర అంశాలపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న సిటింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలతో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) కీలక నివేదిక విడుదల చేసింది. ఆయా ఎమ్మెల్యేలు 2018 ఎన్నికల అప్పుడు ఈసీకి స మర్పించిన అఫిడవిట్ల ఆధారంగా వారి ఆస్తు లు, అప్పులు, నేర చరిత్ర తదితర వివరాలను వెల్లడించింది.
దీనిప్రకారం ప్రస్తుత ఎమ్మెల్యేల్లో అత్యధిక కేసులు ఉన్న వ్యక్తి బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆరే. కేసీఆర్‌పై అత్యధికంగా 64 కేసులు ఉన్నాయి. ఇందులో సీరియస్ ఐపీసీ సెక్షన్లు 37, ఇతర సెక్షన్లు 283 నమోదయ్యాయి. కేసీఆర్ తర్వాతి స్థానాల్లో ఆత్రం సక్కు (45 కేసులు), రాజాసింగ్(43), హరీశ్ రావు(41) ఉన్నారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం.. 118 మంది ఎమ్మెల్యేల్లో 72మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు 59 మంది ఉన్నారు. సీరియస్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న 46 మంది ఎమ్మెల్యేల్లో 38 మంది బీఆర్‌ఎస్ వారే. ఇది కాక, సిటింగుల్లో ఏడుగురు ఎమ్మెల్యేలపై హత్యానేరం కేసులు కూడా ఉన్నాయి. ఇక, సిటింగ్ ఎమ్మెల్యేల్లో అత్యధిక ఆదాయం కలిగిన వారి జాబితాలో కేసీఆర్ 10వ స్థానంలో నిలిచారు. అప్పుల్లో 9వ స్థానంలో ఉన్నారు. మంత్రి కేటీఆర్ ఆదాయంలో నాలుగు, అప్పుల్లో ఐదో స్థానంలో ఉన్నారు. ఇక, 101 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో 93 మంది కోటీశ్వరులు ఉండగా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా కోటీశ్వరులని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది.
తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కేసీఆర్ మీద ఈ కేసులు నమోదు అయినట్టు తెలుస్తోంది. ఇక హరీష్ రావు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు కాబట్టి ఆయనపై కూడా కేసులు నమోదయ్యాయి. కెసిఆర్ తర్వాతి స్థానాల్లో ఉన్న ఆత్రం సక్కు (45 కేసులు), రాజాసింగ్(43) కు వివాదాస్పద రాజకీయ నాయకులుగా పేరు ఉంది. సక్కు పోడు భూముల పోరాటం లో కీలకంగా పాల్గొన్నారు. అందుకే ఆయనపై కేసులు నమోదయ్యాయి. గో సంరక్షణ ఉద్యమకారుడిగా పేరు పొందిన గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద రాజకీయ నాయకుడిగా పేరుపొందారు. ఈయన గోవుల సంరక్షణకు సంబంధించి చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. అలాగే గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్నప్పుడు ఆయన తన పరిధి దాటి వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ముగ్గురు నాయకులే నేరచరితుల జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.