Homeజాతీయ వార్తలుKomatireddy Raj Gopal Reddy: ఒక్క ఓటమి.. రాజగోపాల్‌దే కాదు.. బీజేపీ అడ్రస్‌ కూడా గల్లంతు...

Komatireddy Raj Gopal Reddy: ఒక్క ఓటమి.. రాజగోపాల్‌దే కాదు.. బీజేపీ అడ్రస్‌ కూడా గల్లంతు చేసింది!

Komatireddy Raj Gopal Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేశారు. తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు. నాడు కాగ్రెస్‌ను వీడడానికి అయినా.. నేడు కాంగ్రెస్‌లో తిరిగి చేరడానికి అయినా కారణం కేసీఆర్‌ను గద్దె దించడమే అన్నారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం అనుకుని ఆ పార్టీ చేరడం జరిగిందని, కానీ, ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయంగా మారడంతో తిరిగి కాంగ్రెస్‌ లో చేరుతున్నానని వెల్లడించారు. మరో ఐదు వారాల్లో కేసీఆర్‌ పాలన అంతం కాబోతోందని రాజగోపాల్‌రెడ్డి జోష్యం చెప్పారు.

– రాజీనామా వెనుక కారణమేంటి?
సరిగ్గా 15 నెలల క్రితం కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవితోపాటు కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేశారు. దీంతో గతేడాది అక్టోబర్‌లో మునుగోడు ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ను రాజగోపాల్‌రెడ్డి ఓడించినంత పని చేశారు. బీఆర్‌ఎస్‌ 100 మంది ఎమ్మెల్యేలను మునుగోడులో మోహరించడమే కాకుండా అనేక వరాలు కురిపించింది. సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేసింది. అయినా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కేవలం 10 వేల ఓట్ల మెజారిటీతో గట్టెక్కాడు. ఆ తర్వాత కూడా బీజేపీ పార్టీలో రాజగోపాల్‌రెడ్డికి సముచిత ప్రాధాన్యం ఇచ్చింది. అయితే.. 15 నెలల క్రితం ఉన్న దూకుడు ఇప్పడు బీజేపీలో కనిపించడం లేదు. నాడు అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ బీజేపీని అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేలా చేశారు. కానీ మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి, తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్‌ తెలంగాణలోనూ అనూహ్యంగా పుంజుకుంది. బీజేపీ ఒక్కసారిగా రేసు నుంచి తప్పుకుంది. ఇక ఢిల్లీ లిక్కర్‌ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఇతర స్కాంల గురించి బీజేపీ నేతలు తెలంగాణకు వచ్చి మాట్లాడుతున్నా.. చర్యలకు మాత్రం కేంద్రం వెనుకాడుతోంది. దీంతోపాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని తప్పించడంపై రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు బీజేపీ పుంజుకునే అవకాశం కనిపించకపోవడం కూడా రాజగోపాల్‌రెడ్డి రిజైన్‌కు కారణంగా తెలుస్తోంది.
– కాంగ్రెస్‌లో తిరిగి ఎందుకు చేరుతున్నారు..
ఇక 15 నెలల క్రితం కాంగ్రెస్‌ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి సొంతగూటికి చేరడంపైనా చర్చ జరుగుతోంది. నాడు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడారు. కాంగ్రెస్‌లో అర్హులు ఉన్నా.. అధిష్టానం వలస నేతలకు టీపీసీసీ పదవి ఇవ్వడాన్ని తప్పు పట్టారు. రేవంత్‌తో కాంగ్రెస్‌ కొలాప్స్‌ అవుతుందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని నాడు వ్యాఖ్యానించారు. అందుకే బీజేపీలో చేరానని ప్రకటించారు. కానీ, నేడు బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయకపోయినా, బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగలేదని తన రాజీనామా ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ పార్టీ అని తెలిపారు. అయితే, కాంగ్రెస్‌లో చేరిన తర్వాత 15 నెలల క్రితం కాంగ్రెస్‌పై, టీపీసీసీ చీఫ్‌పై చేసి ఆరోపణలకు రాజగోపాల్‌రెడ్డి ఎలా సమాధానం చెబుతారో చూడాలి.

– బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్మాయం కాంగ్రెస్సేనా?
గాలి ఎటు వీస్తే.. అటు అన్నచందంగా ఉంది రాజగోపాల్‌రెడ్డి పరిస్థితి. నాడు బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. నేడు మాట మార్చి.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అంటున్నారు. తాను పార్టీలు మారడం వెనుక ఉన్న లక్ష్యం ఒక్కటే అది కేసీఆర్‌ను గద్దె దించడమే అని స్పష్టం చేశారు.

– కేసీఆర్‌ను ఎదుర్కోవడంలో బీజేపీ ఫెయిల్‌ అయ్యిందా?
ఇక కేసీఆర్‌ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందన్న భావనతో రాజగోపాల్‌రెడి నాడు బీజేపీలోకి వెళ్లారు. ఎమ్మెల్యే, కేసీఆర్‌ కూతురు కవిత లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ అవుతుందని అంతా భావించారు. రాజగోపాల్‌రెడ్డి కూడా కేసీఆర్‌ జైలుకు పోవడం ఖాయమని ప్రకటించారు. అయితే, బీజేపీ వ్యూహాలు రాజగోపాల్‌రెడ్డికి అంతుచిక్కలేదు. మరోవైపు కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాఫ్‌ పడిపోవడం, కాంగ్రెస్‌ అనూహ్యంగా పుంజుకోవడంలో రాజగోపాల్‌రెడ్డి పునరాలోచనలో పడ్డారు. కొన్ని రోజులుగా బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం కూడా మొదటి జాబితాలో రాజగోపాల్‌రెడ్డి పేరు చేర్చలేదని తెలిసింది.
లక్ష్యం కేసీఆరే…
ఈ ఏడాది చివర్లో జరుగనున్న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలచి ఎట్టిపరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శ్రమిస్తున్న భారతీయ జనతా పార్టీలో కొద్ది రోజులగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన ఈటలæ రాజేందర్, కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉండి బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ లోకి రావాలంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్‌లో కాకరేపాయి. కోమటిరెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరతారా?ఈటలæ కమలం వదిలి హస్తం గూటికి చేరతారా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితంలో మంచి జోష్‌ లో ఉన్న కాంగ్రెస్‌..ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజాభిమానం ఉన్న నాయకులను వదులుకోకూడదు అన్న లక్ష్యంతో అడుగులు వేసింది. ఇటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన కీలక కార్యక్రమాలకు కోమటిరెట్టి హాజరు కాలేదు. లిక్కర్‌ స్కాం విషయంలో ఎమ్మెల్సీ కవిత విషయంలో రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. కుటుంబ పాలన అంతం అవడానికి,కేసీఆర్‌ ను గద్దె దింపాలని ఏకైక లక్ష్యంతో బీజేపీలో చేరారు రాజగోపాల్‌రెడ్డి. ఏ లక్ష్యంతో అయితే బీజేపీలో చేరాడో ఆ లక్ష్యం నెరవేరే అవకాశం కనిపించడం లేదని భావించిన రాజగోపాల్‌రెడ్డి చివరకు బీజేపీని వీడారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular