Telangana Congress: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇతర పార్టీల్లోని అసంతృప్తులను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ స్ట్రాటజిస్ట్ సునీల్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందులోభాగంగానే బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలను తన టీమ్ తోపాటు పర్సనల్ గా కలిసి టికెట్ పై హామీ ఇస్తున్నారు. ఈ కారణంగానే కాంగ్రెస్ రెండో జాబితా ఆలస్యం అవుతోందని తెలుస్తోంది.
టార్గెట్ బీజేపీ, బీఆర్‌ఎస్..
కాంగ్రెస్ ప్రధానంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌లో అసంతృప్త నేతలపై ఫోకస్ పెట్టింది. వారికి గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నది. వీరికి నేరుగా ఢిల్లీ నుంచి ఆహ్వానాలు పంపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే మాజీ ఎంపీలు రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ను పార్టీలోకి రావాలని కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఆహ్వానించారు. రాజగోపాల్‌రెడ్డి చేరిక దాదాపు ఖరారైంది. బీజేపీకి ఆయన రాజీనామా కూడా చేశారు. మును గోడు నుంచే ఆయన పోటీలో ఉంటారని టాక్. ఇక వివేక్ కూడా చేరుతారనే ప్రచారం జరుగుతున్నా. ఒకటి రెండ్రోజు లో క్లారిటీ వస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతోపాటు బీజేపీ సీనియర్ నేతలు విక్రమ్‌గౌడ్, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డితోపాటు బీఆర్‌ఎస్ కు చెందిన తీగల కృష్ణారెడ్డికి కూడా కాంగ్రెస్ ఆహ్వానం పలికేందుకు సిద్ధమైంది. తీన్మార్ మల్లన్ననూ కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని పార్టీ నేతలు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అసంతృప్తులను కలుస్తున్న సునీల్ టీమ్?
అసంతృప్తులను కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు స్ట్రాటజిస్ట్ సునీల్ టీమ్ కీలకంగా వ్యవహరిస్తున్నది. మైనంపల్లి అండ్ సన్, పొంగులేటి అండ్ టీమ్, తుమ్మల, ఇతరులు హస్తం పార్టీ కండువా కప్పుకోవడంలోనూ సునీల్ పాత్ర ఉన్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సునీల్ తన టీమ్‌తో కలిసి గత కొన్ని రోజులుగా అసంతృప్త నేతలను పర్సనల్ గా కలు స్తున్నట్లు తెలిసింది. ఆయన చేసిన సర్వేలు, నివేదికలను
ఆయా నేతలకు వివరించి పర్సనల్ ఇమేజ్, ఇప్పుడున్న పార్టీ తో ఓటింగ్, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వచ్చే మైలేజ్, గెలుపు అవకాశాలు వంటి అంశాలపై ఆయన పలు రిపోర్టు లను సదరు నేతలు ముందు పెడుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఒప్పిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం కొందరికి ముందుగా టికెట్ల హామీ కూడా ఇస్తున్నట్లు సమాచారం. రెండో విడత బస్సు యాత్రలో కూడా కొందరు బడా నేతలను కాంగ్రెస్‌లో చేర్పించేందుకు సునీల్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.