BRS: ఎమ్మెల్యేలుగా గెలిచారు. మంత్రులుగా ప్రమోషన్ పొందారు. పది సంవత్సరాలుగా వారి వారి నియోజకవర్గాలకు, శాఖలకు సామంత రాజులుగా వెలుగొందారు.. వందల కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని దండిగా ప్రచారం చేసుకున్నారు. అంతేకాదు మరొకసారి టికెట్ కూడా దక్కించుకున్నారు..బీ ఫామ్ కూడా వస్తుందని తమ అనుచరుల వద్ద చెబుతున్నారు. ఇంత జరుగుతోంది.. కానీ ఎన్నికల్లో ఆ మంత్రులు గెలుస్తారా? గెలిచి ముఖ్యమంత్రి వద్ద పరపతి పెంచుకుంటారా?
భారత రాష్ట్ర సమితి 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఇందులో మొదటి దఫా గా కొంతమంది మంత్రులుగా ప్రమోషన్ పొందారు. ఆ తర్వాత చేరికలకు గేట్లు ఎత్తడంతో ఇతర పార్టీలకు చెందినవారు భారత రాష్ట్ర సమితి కండువా కప్పుకున్నారు. వారిలో కొందరికి మంత్రి పదవులు దక్కాయి. వీరిలో కొంతమందికి ముఖ్యమంత్రి అపరిమితమైన స్వేచ్ఛ ఇవ్వడంతో అడ్డు అదుపు లేకుండా పోయింది. గతంలో కంటే వీరి ఆస్తులు రెట్టింపు అయ్యాయి.. కనీ విని ఎరుగనిస్థాయిలో వీరి అనుచరులు కూడా సంపాదించారు. ఒక రకంగా చెప్పాలంటే తమ నియోజకవర్గాలతో పాటు కేటాయించిన శాఖలపై కూడా పట్టు పెంచుకున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల గొంతు పెగలనీయకుండా చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లోనూ తమ అనుచరులకే పెద్ద పీట వేశారు. తమ కార్యకర్తలకే అభివృద్ధి పథకాలు అందే విధంగా చర్యలు తీసుకున్నారు. దళిత బందు నుంచి మొదలు పెడితే గృహ లక్ష్మీ పథకం వరకు.. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ వారు తమ హవా కొనసాగించారు. వివాదాస్పద అంశాల్లోనూ వేలు పెట్టారు. అధిష్టానానికి కావాల్సింది ఇవ్వడంతో ముఖ్యమంత్రి కూడా పెద్దగా వీరిపై చర్యలు తీసుకోలేదు. దీంతో వారు మరింత రెచ్చిపోయారు.
ఇలా 10 సంవత్సరాలపాటు అధికారాన్ని దర్జాగా అనుభవించిన వారు ఇప్పుడు ప్రజా పరీక్షను ఎదుర్కోబోతున్నారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో వారికి అసలు సవాల్ ఎదురు కాబోతోంది. ముఖ్యమంత్రి చెప్పినట్టుగానే వారందరికీ టికెట్లు కేటాయించారు. అసలే మంత్రులు కావడం, ఇన్ని సంవత్సరాలపాటు దర్జాగా అధికారాన్ని వెలగబెట్టడంతో అందరి కళ్ళూ వారి పైనే ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి టికెట్ కేటాయించిన మెజారిటీ మంత్రులు తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు చెందిన కొంతమంది మంత్రులు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొంటున్నారు. వీరిలో చాలామంది భూ వివాదాలలో తల దూర్చారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించాలనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా చెరువులను కూడా కబ్జా చేశారనే విమర్శలు ఉన్నాయి. పైగా వీరి అనుచర వర్గం వీరంగం సృష్టించడంతో నియోజకవర్గాలలో అధికార పార్టీ ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఈ మంత్రులు ప్రస్తుతం క్షేత్రస్థాయిలోనే ఉంటున్నారు. ప్రగతి భవన్ మార్గదర్శకంలోనే పనిచేస్తున్నారు. అయితే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న మంత్రులతో ముఖ్యమంత్రి ప్రతిరోజు మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది? కార్యకర్తలను రోజూ కలుస్తున్నారా? ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఎలా ఉంది? వంటి అంశాలను ఇంటిలిజెన్స్ ద్వారా తెప్పించుకున్నట్టు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా ఆ మంత్రులకు ముఖ్యమంత్రి బీ ఫామ్స్ ఇస్తారా, లేక ఏమైనా మార్పులు చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.