Teenmar Mallanna: కాంగ్రెస్‌ను తిట్టి.. రేవంత్‌ను తూర్పారపట్టి.. మళ్లీ అదే పార్టీలో ఎట్లా చేరావ్‌ తీన్మార్‌ ‘మల్లన్న’!

కేసీఆర్‌ ప్రభుత్వంపై నిత్యం నిప్పులు చెరిగే చింతసడే నవీన్‌ అలియాస్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొమ్మ మహేశ్‌కుమార్‌ పార్టీలోకి ఆహ్వానించారు.

Written By: Suresh, Updated On : November 8, 2023 2:42 pm

Teenmar Mallanna

Follow us on

Teenmar Mallanna: తెలంగాణలో ఎన్నికల సందడి రోజురోజుకూ హీటెక్కుతోంది. అధికార బీఆర్‌ఎస్, విపక్ష కాంగ్రెస్‌ నువ్వా నేనా అన్నట్లుల తలపడుతున్నాయి. ప్రచారంలోనూ జోరు పెంచాయి. మరోవైపు చేరికల పర్వం పోటాపోటీగా కొనసాగిస్తున్నాయి. ఎన్నిలకు ఇంకా 20 రోజులే గడువు ఉంది. ఈసారి ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ కూడా గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ వ్యూహం ఎవరికీ అర్థం కావడం లేదు. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా కాంగ్రెస్‌ వ్యూహాలను అనుసరించలేకపోతోంది. ఒకవైపు ఇతర పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు నిరంతరం కాంగ్రెస్‌లో చేరుతుండగా, మరోవైపు ప్రజలు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతుండడంతో గులాబీ నేతల్లో టెన్షన్‌ పెరుగుతోంది.

హస్తం గూటికి చింతపడు నవీన్‌..
కేసీఆర్‌ ప్రభుత్వంపై నిత్యం నిప్పులు చెరిగే చింతసడే నవీన్‌ అలియాస్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొమ్మ మహేశ్‌కుమార్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ విషయాన్ని టీ కాంగ్రెస్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. ఇప్పటికే పలువురు ప్రముఖ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. వారిలో కొందరికి టిక్కెట్‌ కూడా వచ్చింది. తీన్మార్‌ మల్లన్న కూడా మేడ్చల్‌ నుంచి పోటీ చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కొత్త పార్టీ పెట్టనున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ.. కేసీఆర్‌ను ఓడించే సత్తా కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని భావించిన కాంగ్రెస్‌ తీన్మార్‌ మల్లన్న కాంగ్రెస్‌లో చేరారు.

గతంలో బీజేపీలో..
ఏడాది క్రితం తీన్మార్‌ మల్లన్న బీజేపీలో చేరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆయనను అరెస్ట్‌ చేయించడంతో సుమారు ఆరు నెలలు జైల్లో ఉన్నారు. ఈ సమయంలో నిజాబాబాద్‌ ఎంపీతో సంప్రదింపులు జరిపిన తీన్మార్‌ మల్లన్న బయటకు రావడం కోసం కమలం పార్టీకి దగ్గరయ్యారు. బయటక వచ్చిన తర్వాత బీజేపీలో చేరారు కూడా. అయితే ఆరునెలలకే పార్టీని వీడారు. తాను పార్టీలో ఉంటే.. ప్రజలకు దూరమవుతున్నానని భావించి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

కాంగ్రెస్‌ను తిట్టి.. రేవంత్‌ను ధూషించి..
ఇక తీన్మార్‌ మల్లన్న గతంలో కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోశారు. అసమర్థ పార్టీ కాంగ్రెస్‌కారణంగానే కేసీఆర్‌ మరింత రెచ్చిపోతున్నారని ఆరోపించారు. ఇక టీపీసీసీగా రేవంత్‌కు పగ్గాలు అప్పగించిన తర్వాత కూడా తన యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా రేవంత్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ అని ఆరోపించారు. టీపీసీసీ చీఫ్‌ పదవిని కొనుక్కున్నాడని, ఇక కాంగ్రస్‌ ఖతం అయినట్లే అని వెల్లడించారు. కానీ, అనూహ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ తిరిగి రేవంత్‌ సమక్షంలోని కాంగ్రెస్‌ గూటికి చేరారు.

బలమా.. బలహీనతా..
అయితే మల్లన్న చేరిక ఇప్పుడు కాంగ్రెస్‌కు బలమా.. బలహీనతా అన్న చర్చ జరుగుతోంది. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న తీన్మార్‌ మల్లన్న 2014లో ఎమ్మెల్యే టికెట్‌ ఆశించారు. టికెట్‌ దక్కకపోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చారు. తర్వాత యూట్యూబ్‌ చానెల్‌ పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి మంచి ఓట్లు సాధించారు. తర్వాత ఆయన పార్టీ పెడతారన్న ప్రచారం జరిగింది. కానీ, అరెస్ట్‌ తర్వాత బీజేపీలో చేరారు. కొన్ని రోజులకే ఆ పార్టీని వీడారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఎక్కడా స్థిరంగా, కుదురుగా ఉండని తీన్మార్‌ మల్లన్న కాంగ్రెస్‌ను గెలిపిస్తాడా లేక పుట్టి ముంచుతాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.