CM Jagan- Teachers: రహదారులను జల్లెడ పడుతున్నారు. వాహన తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. బస్సుల్లో ప్రయాణికులను ఎక్కడికి వెళుతున్నారని ఆరా తీస్తున్నారు. గత మూడు రోజులుగా ఏపీ వ్యాప్తంగా పోలీసులు చేపడుతున్న చర్యలివి. సెప్టెంబరు 1న సీపీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయులు సీఎం జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. గత నెలరోజులుగా ఉపాధ్యాయ సంఘాలు కార్యక్రమానికి సంబంధించి అన్ని సన్నాహాలు చేశారు.ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేయాలని సంకల్పించాయి. పెద్దఎత్తున ఉపాధ్యాయులను సైతం సమీకరించాయి. అయితే గత అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రతమత్తమైంది. ముందుగా వారితో సానుకూల చర్చలు జరపాలని నిర్ణయించింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలతో కూడిన బృందం ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపింది. అయితే మంత్రులు మాత్రం సీపీఎస్ తప్పించి ఇతరత్రా చర్చలకు సిద్ధమని చెప్పడంతో ప్రతిష్ఠంభన ఎదురైంది. ఎట్టిపరిస్థితుల్లో సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ రద్దు చేయాల్సిందేనని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేయడంతో మంత్రులు చేతులెత్తేశారు. దీంతో సీఎం ఇంటి ముట్టడిని యథావిధిగా జరుపుకోవాలని ఉపాధ్యాయులు నిర్ణయించారు.

విజయవాడలో రెడ్ అలెర్ట్..
అయితే సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమం రణరంగమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీపీఎస్ రద్దును డిమాండ్ చేస్తూ గత కొద్ది నెలలుగా వివిధ దశాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలు ఆందోళనలు చేస్తూ వస్తున్నాయి. అందులో భాగంగా నెలల కిందటే సెప్టెంబరు 1న సీఎం జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో అటు ప్రభుత్వం లైట్ తీసుకుంది. ఉద్యోగ, ఉపాధ్యాయులు మాత్రం పట్టు వీడలేదు. మిలియన్ మార్చ్ తరహాలో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని నిర్ణయించాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మేల్కొంది. ఉద్యోగ, ఉపాధ్యాయుల ముట్టడి విజయవంతమైతే..మాత్రం రాజకీయంగా తమకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశముందని ప్రభుత్వంలో కలవరం ప్రారంభమైంది. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపాలని చూస్తోంది. ఇప్పటికే ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, సంఘాల్లో యాక్టివ్ గా ఉన్నవారికి ముందస్తుగా నోటీసులు అందించింది. బైండోవర్ కేసులు కట్టింది. విజయవాడ వెళితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అంతటితో ఆగకుండా కుటుంబసభ్యలకు కూడా పోలీసులు హెచ్చిరికలు పంపుతున్నారు. అటు విజయవాడలో వేలాది మంది పోలీసులు మోహరించారు. విజయవాడ వస్తే ఇక అంతే సంగతులు అన్న సంకేతాలను సైతం పంపుతున్నారు.
గురువులకు గుణపాఠం..
అయితే గత ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏరికోరి తెచ్చుకున్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దుచేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇక అంతే వాతావరణం వైసీపీకి అనుకూలంగా మారిపోయింది. ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్లకార్డులు ప్రదర్శించి మరీ ప్రచారం చేశారు. తమ కుటుంబాలనే కాకుండా తమ మాట ప్రభావంతో వేలాది కుటుంబాలను ప్రభావితం చేసి గుంపగుత్తిగా వైసీపీకి ఓట్లు వేయించారు. అటు బ్యాలెట్ ఓట్ల రూపంలోనే వైసీపీ ఏకపక్ష విజయానికి సంకేతాలిచ్చారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీన్ మారిపోయింది. వారం రోజుల్లో సీపీఎస్ రద్దుచేస్తామన్న హామీ..తొలుత వారం దాటింది..తరువాత రెండు వారాలు దాటింది..అటు తరువాత నెల, ఏడాది, మూడేళ్లు దాటిపోయింది. కానీ సీపీఎస్ రద్దుకు అతీగతీ లేకుండా పోయింది. ఏమని ప్రశ్నిస్తుంటే అవగాహన లేక సీపీఎస్ రద్దుకు హామీ ఇచ్చామని.. ఇప్పుడు అమలు సాధ్యం కాదంటూ అడ్డగోలు వాదనకు ప్రభుత్వం తెరతీసింది.

ప్రతిఘటనకు సిద్ధం..
సీపీఎస్ రద్దు హామీతో సీఎం జగన్ రాజకీయ ఉన్నత కొలువు సాధించారు. నమ్మి ఓటేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాత్రం దారుణంగా వంచించబడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపడానికి ప్రయత్నిస్తుంటే అణచివేతకు గురవుతున్నారు. అయితే మేధావి వర్గమైన ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో మాత్రం ఆగ్రహం పెల్లుబికుతోంది. అదే సమయంలో ఏరికోరి కష్టాలు తెచ్చుకున్నామన్న పశ్చాత్తాపం కూడా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు వైసీపీ ప్రభుత్వ చర్యలను భరించలేకపోతున్నారు. పీఆర్సీ విషయంలో దారుణంగా మోసం చేశారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు సీపీఎస్ విషయంలో మడమ తిప్పడమే కాకుండా వేధింపులకు దిగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలన్న నిర్ణయానికి వచ్చారు.