Nara Lokesh: జర్నలిస్టు.. సమాజంలో గుర్తింపు ఉన్న ప్రొఫెషన్. ఎంతటి వారైనా కాస్తా మర్యాద ఇచ్చి మాట్లాడతారు. సమాజం పట్ల అవగాహన ఉన్న వృత్తిగా గౌరవించేవారు. అటు ప్రభుత్వం, యంత్రాంగం సైతం జర్నలిస్టును ఒక ప్రత్యేక గౌరవంగా చూసేది. కానీ అదంత గతం. ప్రభుత్వాల్లో మారిన పోకడలు, మీడియా రంగంలో విస్తృత మార్పులు, యాజమాన్యాల వైఖరితో జర్నలిస్టులు నడిరోడ్డున నిలబడ్డారు. నైతిక విలువలు, కలం కట్టుబాట్లు మరిచి యాజమాన్యాల కట్టుబానిసలుగా మారుతున్నారు. అటు యాజమాన్యాలు రాజకీయ పార్టీలు, పారిశ్రామికవేత్తల తొత్తులుగా మారుతున్నాయి. ప్రభుత్వం నుంచి జర్నలిస్టులకు రావాల్సిన రాయితీలు యాజమాన్యాల వైఖరిపై ఆధారపడుతున్నాయి. అనుకూలంగా ఉంటే అగ్రతాంబూలం ఇస్తున్నారు. లేకుంటే మాత్రం నిబంధనల పేరిట తొక్కిపెడుతున్నారు.
జర్నలిస్టులకు గుర్తింపునిచ్చింది ఎన్టీ రామారావు. తరువాత చంద్రబాబు సైతం గౌరవం ఇచ్చేవారు. కానీ రాజకీయ పార్టీలకు సొంత మీడియా వచ్చిన తరువాత పరిస్థితి మారింది. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత తీసికట్టుగా మారింది. చివరకు జర్నలిస్టులకు ప్రభుత్వ గుర్తింపు కూడా కరువైంది. ఎన్నో నిబంధనలను తెరపైకి తెచ్చి అక్రిడేషన్లలో కోత విధించారు. పెద్ద పత్రికలకు సైతం పక్కనపడేశారు. చిన్న పత్రికలకు కనీస పరిగణలోకి తీసుకోవడం లేదు. జర్నలిస్టు సంఘాలకు విలువ లేదు. అక్రిడేట్ కమిటీల్లో కనీస ప్రాతినిధ్యం లేదు.
గత ఎన్నికలకు ముందు జర్నలిస్టులు జగన్ ప్రభుత్వం రావాలని అభిలాషించారు. అందుకు తమ వంతు సాయాన్ని సైతం అందించారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ విశ్వరూపం ప్రదర్శించారు. జర్నలిస్టులంటే తన సొంత మీడియా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల మాదిరిగా ఉంటారని భావించారు. గతం నుంచి వస్తున్న అక్రిడేషన్లు, రాయితీ బస్సు పాసులను తొలగించారు. చంద్రబాబు హయాంలో రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్నాజిల్లాల్లో ఒకప్పుడు స్టేట్ జర్నలిస్ట్ అక్రిడేషన్ ఉన్న పాత్రికేయులు ఏసీ బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం ఉంది. కానీ, తాజాగా జగన్ ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని తొలగించేసింది. ఇలా.. పాత్రికేయులను వాడుకుంటున్నారే తప్ప ఎవరూ కూడా వారికి ఉపయోగపడుతున్న దాఖలా కనిపించకపోవడంతో మా ఉసురు తగులుందని ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు
అక్రిడేషన్ మంజూరు కోసం రకరకాల కొర్రీలు, ఆంక్షలు వేసిన సమాచార శాఖ యాజమాన్యాల విషయంలో మాత్రం ఉదారంగా వ్యవహరించినట్లు కనిపించింది. ఉద్యోగ భద్రత, కార్మిక చట్టాలు ఏ మాత్రం వర్తించని అసంఘటిత రంగం కోసం కనీస ధర్మం కూడా పాటించక పోవడం వెనుక మర్మం ఇట్టే తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ తప్పును ఎత్తిచూపుతున్న ప్రతిపక్షం టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. మహానాడు వేదికగా రాష్ట్రంలో అన్నిరకాల మీడియా జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇస్తామని టీడీపీ యువనేత నారా లోకేష్ సభాముఖంగా ప్రకటించారు. కనీసం ఈ ప్రకటనతోనైనా జగన్ సర్కారు మేల్కొంటుందో చూడాలి మరీ.