తూర్పుగోదావరి జిల్లా దివీస్ పరిశ్రమలో విధ్వంసం తీవ్ర దుమారం రేపుతోంది. దాదాపుగా వెయ్యి మందికిపైగా ఒక్క సారిగా పరిశ్రమపై దాడి చేసి.. గోడలు బద్దలు కొట్టి.. నిర్మాణాలకు.. కంటెయినర్లకు నిప్పు పెట్టారు. ఆందోళనకారుల ఆవేదనతోనే ఇదంతా చేసినట్లుగా స్పష్టమవుతోంది. అంతేకాదు.. రాజకీయ పార్టీలూ తమను మోసం చేశాయన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. తమను ఎవరూ పట్టించుకోకుండా.. రాజకీయంగా వాడుకుంటూ.. తమను కాలుష్యానికి బలి చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
Also Read: జగన్‌తో ట్వంటీ ట్వంటీ ఆడేసుకున్న 2020
తొండంగిలోని సెజ్ కోసం స్థలం కేటాయించగా.. అందులో దివీస్ పరిశ్రమ పెట్టాలని టీడీపీ హయాంలో నిర్ణయించారు. అందుకు గాను అప్పటి ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే.. ఆ పరిశ్రమ కాలుష్య కారకమని.. వద్దంటూ వైసీపీ నేతలు.. రైతులను రెచ్చగొట్టి ఉద్యమం చేశారు. పెద్ద ఎత్తున వివాదాలు జరిగాయి. ప్రతిపక్ష నేత జగన్.. దివీస్ పరిశ్రమను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. తాము గెలవగానే కాలుష్య కారక పరిశ్రమలన్నింటినీ దూరంగా తరలిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అక్కడి ప్రజలు వైసీపీకి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు.
కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఆ పరిశ్రమకు శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు. దీంతో అక్కడ ఆందోళనలు చేసిన వారి కడుపు మండిపోయింది. జగన్ కూడా తమను మోసం చేశారంటూ.. అక్కడి ఆందోళనకారులు.. తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. కొద్ది రోజులుగా నిరాహారదీక్షలు చేస్తున్నారు.
Also Read: బీజేపీ డ్యూయెల్ రోల్..: అటు రైతులతో, ఇటు సీఎంలతో చర్చలు
జగన్ నిర్ణయంతో వారిలో ఆగ్రహం పెరిగిపోయింది. కాలుష్య కారక పరిశ్రమను బలవంతంగా తమ నెత్తిపై పెట్టబోతున్నారని అసహనానికి లోనయ్యారు. ఫలితంగా విధ్వంసకాండ సృష్టించారు. ఈ విషయంలో వైసీపీ మాత్రమే కాదు.. టీడీపీ కూడా మడమ తిప్పింది. గతంలో దివీస్ పరిశ్రమకు అనుమతి ఇచ్చిన టీడీపీ నేతలు ఇప్పుడు అక్కడ పరిశ్రమ వద్దంటున్నారు. ఈ తీరుతోనే ప్రజల్లో తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఏర్పడుతోంది. మరోవైపు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనావాసాల మధ్య కాలుష్య పరిశ్రమ వద్దంటూ నినదించిన వైసీపీ.. ఇప్పుడు శంకుస్థాపనకు రావడం గమనార్హం.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్