Pawan Kalyan- BJP: లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే విపక్ష యూపీఏ కూటమి ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఇదే సమయంలో అధికార ఎన్డీఏ కూడా హ్యాట్రిక్ విజయం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే యూపీఏ కూటమి విపక్ష పార్టీలతో రెండు సమావేశాలు నిర్వహించింది. మరో సమావేశానికి కూడా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి కూడా.. సమావేశం కావాలని నిర్ణయించింది. ఈనెల 18న నిర్వహించే సమావేశానికి రావాలని భాగస్వామ్య పక్షాలకు ఆహ్వానం పంపింది. కొన్ని తటస్థ పార్టీలకు కూడా ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.
ఏపీ నుంచి ఆహ్వానం ఎవరికో..
ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ఎన్డీఏతో స్నేహం కోరుకుంటున్నాయి. అయితే ఎన్డీఏలో భాగస్వామిగా ఉండేందుకు వైసీపీ సుముఖంగా లేదు. ఇదే సమయంలో ఎన్డీఏలో చేరేందుకు టీడీపీ ఆసక్తి కనబరుస్తున్నా.. చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. అయినా.. టీడీపీ కేంద్రంలోని బిల్లులకు మద్దతు ఇస్తూ.. పరోక్షంగా సంకేతాలు ఇస్తోంది. స్నేహæహస్తం కోరుతోంది. ఈ క్రమంలో ఎన్డీఏ నుంచి ఆహ్వానం ఎవరికి అందింది అనే విషయం మాత్రం బయటకు రావడం లేదు.
నిర్ణయాధికారం జనసేనానిదే..
ఇక జనసేన పార్టీ బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతోంది. అయితే ఏనాడూ కలిసి పనిచేసింది మాత్రం లేదు. ఇందుకు జనసేన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కారణమని ఇన్నాళ్లూ జనసేనాని చెప్పారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కారణంగానే ఏపీలో కలిసి పనిచేయలేకపోతున్నామని అనేక సందర్భాల్లో ప్రకటించారు. కేంద్రంతో మాత్రం టచ్‌లో ఉంటున్న పవన్.. రాష్ట్రంలో మాత్రం కలిసి పనిచేయడం లేదు. ఈ క్రమంలో లోక్‌సభ, ఏపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు పొత్తుల అంశం తేల్చాసింది పవనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవైపు బీజేపీతో కలిసి పనిచేస్తూ.. మరోవైపు టీడీపీతో చర్చలు జరుపడం ఇబ్బందికరంగా మారింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏపీలో పోటీ చేయాలన్న ఆలోచనలో పవన్ ఉన్నారు.
టీడీపీతో దోస్తీ లేదంటున్న బీజేపీ..
ఇదే సమయంలో టీడీపీతో దోస్తీకి చాన్స్ లేదంటున్నారు బీజేపీ జాతీయ నాయకులు. ఇందుకు బలమైన కారణం కూడా ఉంది. 2019 ఎన్నికల సమయంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు.. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాతోపాటు బీజేపీ నాయకత్వంపై ఎవరూ చేయనన్ని విమర్శలు చేశారు. శాపనార్థాలు పెట్టారు. మోసం చేశారని ధూషించారు. తిరుపతికి వచ్చిన హోంమంత్రి అమిత్‌షాపై రాళ్లు వేయించారు. ఈ నేపథ్యంలో టీడీపీని దూరం పెట్టడమే మంచిది అన్న భావనలో బీజేపీ ఉంది. దీంతో పవన్ ఆశించిన పొత్తు కుదిరే అవకాశం లేదు.
పవన్ ఎటువైపో..
ఇలాంటి పరిస్థితిలో పవన్ ఎటువైపు ఉండాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పవన్‌ను టీడీపీ దత్తపుత్రుడు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు బీజేపీతో పవన్ దోస్తీ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికలకు ఎవరితో వెళ్లాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. బీజేపీతో కలిసి వెళ్లాలా.. టీడీపీతో ఉండిపోవాలా అనేది పవన్ త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అయితే పవన్ ఇప్పటికీ జనసేన, బీజేపీ, టీడీపీ ఊటమి గురించి ప్రయత్నం చేస్తున్నారు. కానీ, అది ఫలించకపోతే మాత్రం జనసేనాని తన నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. టీడీపీతో ఉంటే.. బీజేపీపై వార్ ప్రకటించాలి. బీజేపీతో ఉంటే.. టీడీపీని దూరం పెట్టాలి. ఈ పరిస్థితిలో జనసేనాని ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.