కేంద్ర జోక్యం కోరుతున్న టిడిపి

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టడం కోసం టిడిపి నేతలు వ్యూహం మారుస్తున్నారు. నేరుగా విమర్శలు చేయకుండా కేంద్ర ప్రభుత్వ ప్రస్తావనను తరచూ తీసుకు రావడం ద్వారా జగన్ ను ఇరకాటంలో పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. ఈ వారం ప్రారంభంలో ప్రధాని మోదీ తో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడడంతో జగన్ ఖంగు తిన్నట్లు ప్రచారం జరగడం తెలిసిందే. ప్రధానితో చంద్రబాబు రాజకీయ అంశాలను ప్రస్తావించే అవకాశం లేకపోయినా కేంద్ర […]

Written By: Neelambaram, Updated On : April 18, 2020 12:17 pm
Follow us on

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టడం కోసం టిడిపి నేతలు వ్యూహం మారుస్తున్నారు. నేరుగా విమర్శలు చేయకుండా కేంద్ర ప్రభుత్వ ప్రస్తావనను తరచూ తీసుకు రావడం ద్వారా జగన్ ను ఇరకాటంలో పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. ఈ వారం ప్రారంభంలో ప్రధాని మోదీ తో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడడంతో జగన్ ఖంగు తిన్నట్లు ప్రచారం జరగడం తెలిసిందే.

ప్రధానితో చంద్రబాబు రాజకీయ అంశాలను ప్రస్తావించే అవకాశం లేకపోయినా కేంద్ర పేరు చెబితేనే జగన్ ప్రభుత్వం ఒక విధంగా అసహనానికి గురవుతున్నట్లు కనిపిస్తున్నది. తాజాగా కరోనాను కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడంతో కేంద్రం జోక్యం చేసుకోవాలని సీనియర్ టిడిపి నాయకుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని, ఏపీ ప్రభుత్వ బరితెగింపు విధానాలకు కళ్లెం వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికి కేంద్రం పలు రూపాలలో జగన్ ను ఇబ్బందులలోకి నెట్టివేస్తున్నది. వాటికి టిడిపి నేతలు తరచూ కేంద్రం ప్రస్తావన తెస్తూ మరింతగా ఇరకాటం సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నది.

రాష్ట్రంలో కరోనా తీవ్రత పెద్దగా లేదని చూపుతూ, కేవలం రెండు జిల్లాల్లో మాత్రమే 20కు పైగా పాజిటివ్ కేసులు ఉండడంతో రెడ్ జోన్ లోకి వస్తాయని వాదించింది. అయితే ఆశ్చర్యకరంగా రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా, వాటిల్లో 11 జిలాలలను రెడ్ జోన్ లో ఉంచుతూ కేంద్రం ప్రకటించింది.

దానితో ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం, రాజధానిని విశాఖకు మార్చడం కోసం జగన్ ఏర్పర్చుకున్న రాజకీయ ఎజెండాకు గండి పడినట్లు అయింది. కేంద్రం జోక్యం చేసుకుని సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఇదే సరైన సమయం అని పేర్కొనడం ద్వారా జగన్ ప్రభుత్వంలో, ముఖ్యంగా అధికారులలో ఒక విధమైన భయం కలిగించేందుకు యనమల అస్త్రం సంధించినట్లు కనబడుతున్నది.

వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఉధృతం అవుతోందని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను, ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని యనమల ధ్వజమెత్తారు. వైరస్ నియంత్రణకు కేంద్రం ఇచ్చిన నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని యనమల ఆరోపించారు.

అయితే రాష్ట్రంలో కరోనా కట్టడికి జగన్ చేస్తున్న కృషిని కేంద్ర మంత్రులు పలువురు ప్రశంసిస్తున్నట్లు పలువురు వైసిపి నేతలు ప్రకటనలు చేశారు. కానీ ఆ విధంగా ప్రశంసించిన కేంద్ర మంత్రుల పేర్లను మాత్రం చెప్పడం లేదు.

అర్ధాంతరంగా ఎన్నికల కమీషనర్ ను తొలగించడం, కేంద్ర ప్రమేయం లేకుండా, కోర్ట్ ల ఆదేశాలతో సంబంధం లేకుండా దొడ్డిదోవన రాజధానిని మార్చే ప్రయత్నాలు చేయడం వంటి అంశాలపై టిడిపి నేతలు కేంద్ర ప్రభుత్వంకు పలు ఫిర్యాదులు, నివేదికలు పంపుతున్నట్లు తెలుస్తున్నది.

కరోనా పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాల్లో కోతలు విధించిన జగన్ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారుల జీతాల్లో మాత్రం కోతలు పెట్టకపోవడాన్ని ఈ సందర్భంగా యనమల ప్రశ్నించారు.

దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా సుమారు 25 మంది సలహాదారులను నియమించుకున్నారు. వారిలో పలువురు జగన్ కుటుంభంకు చెందిన సాక్షి ప్రచురణలో కీలక పదవులలో ఉన్నవారు కావడం గమనార్హం.