TDP: మహాకూటమి వైపు టిడిపి అడుగులు? మరి జనసేనో?

తెలంగాణ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ నడిచింది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి మధ్య గట్టి పోరాటం జరిగింది. పార్టీ ఆవిర్భావం నుంచి పోటీ చేస్తూ వస్తున్న టిడిపి వ్యూహాత్మకంగా సైడ్ అయింది.

Written By: Dharma, Updated On : December 2, 2023 2:48 pm

TDP

Follow us on

TDP: టిడిపి మహాకూటమి వైపు చూస్తోందా? తనతో పాటు జనసేనను తీసుకెళ్ళనుందా? అసలు చంద్రబాబు మనసులో ఉన్న మాట ఏంటి? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అప్పుడే జాతీయస్థాయిలో తెలుగు పార్టీల పాత్ర ఏమిటి అన్న చర్చ ప్రారంభమైంది. అటు బిజెపి చూస్తే కెసిఆర్ ను ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏలో చేర్చుకోమని తేల్చి చెప్పింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు మద్దతు తెలపడం ద్వారా మహాకూటమి వైపు వెళ్తామని సంకేతాలు ఇచ్చింది. స్నేహితుడు పవన్ మాత్రం ఇంకా ఎన్డీఏతో కొనసాగుతున్నారు. తెలంగాణలో ఆ పార్టీతో కలిసే పోటీ చేశారు. అయితే వీటన్నింటికీ రేపు వెల్లడయ్యే ఫలితాలు పరిష్కార మార్గం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ నడిచింది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి మధ్య గట్టి పోరాటం జరిగింది. పార్టీ ఆవిర్భావం నుంచి పోటీ చేస్తూ వస్తున్న టిడిపి వ్యూహాత్మకంగా సైడ్ అయింది. ఎన్నికల్లో పోటీ చేయలేదు. అలాగని ఏ పార్టీకి మద్దతు తెలపలేదు. కానీ పార్టీ శ్రేణులు మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాయి. కెసిఆర్ పై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ అనుకూల పవనాలు వెరసి బిఆర్ఎస్ ఓటమికి కారణాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు ఎగ్జిట్ పోల్స్ సైతం అవేరకంగా ఫలితాలు వెల్లడించాయి.దీంతో రేపటి ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాదిరిగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే.. జాతీయస్థాయిలో తెలుగు పార్టీల పాత్ర ఏమిటి అన్నది తెలిసిపోతుంది. ఏపీలో తెలుగుదేశం, జనసేన పొత్తుతో ఉన్నాయి. తెలంగాణలో మాత్రం జనసేన బిజెపితో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. తెలుగుదేశం మాత్రం బిజెపికి కానీ.. జనసేనకు గాని మద్దతు ప్రకటించలేదు. ఆ పార్టీ శ్రేణులు కాంగ్రెస్కు పని చేసినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఏపీలో తమతో బిజెపి కలిసి వస్తుందని టిడిపి, జనసేన భావించాయి. అదే సమయంలో నిన్నటి విస్తృతస్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ సైతం తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తానని.. ఇందులో మరో ప్రసక్తి అంటూ లేదని తేల్చేశారు. ఎక్కడ బిజెపి కలిసి వస్తుందని చెప్పలేదు. కానీ జాతీయస్థాయిలో తనకు మంచి గుర్తింపు ఇచ్చారని ప్రధాని మోదీ, అమిత్ షాలను గుర్తు చేసుకున్నారు.

తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తే చంద్రబాబు ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తారని ఒక ప్రచారం జరుగుతోంది. పవన్ను ఒప్పించి తన వెంట తీసుకెళ్తారని టాక్ నడుస్తోంది. అయితే అది సాధ్యమా? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. బిజెపి కలిసి రాకపోయినా.. ఆయన కాంగ్రెస్ వైపు వెళ్లరని.. అంతటి సాహసం చేయరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుతో చంద్రబాబు వ్యూహం పనిచేయవచ్చునేమో కానీ.. నేరుగా కాంగ్రెస్ పార్టీతో అంటగాకే ప్రయత్నం చేయరని.. గత అనుభవాలతో ఆచితూచి అడుగులు వేస్తారని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు వేచి చూస్తారని.. ఆ తరువాతే నిర్ణయాలు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.