Yellow Media- TDP: వచ్చే ఎన్నికలు టిడిపికి చావోరేవో లాంటివి. అందుకే ఆ పార్టీ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎన్నికల్లో పొరపాటున ఓటమి ఎదురైతే జరిగే పరిణామాలు తెలుసు. అందుకే చంద్రబాబు శక్తి యుక్తులను ప్రదర్శిస్తున్నారు. అయితే ఒంటరి పోరు తో ఎంతవరకు గట్టెక్కగలము అని భయపడుతున్నారు. అందుకే జనసేన కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే చిక్కినట్టే చిక్కి పవన్ దూరం జరుగుతున్నారు.
పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్డీఏ భాగస్వామి పక్షాల సమావేశానికి హాజరై కొత్త సంకేతాలు ఇచ్చారు. ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు. దీంతో రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. అదే సమయంలో టిడిపి శ్రేణులకు మాత్రం కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఎన్డీఏ అంటే తమపార్టీ చేరుతుందా? లేదా? బీజేపీ చోటు కల్పిస్తుందా? లేదా?అన్నది సగటు టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. దీనికి నాయకత్వం నుంచి సరైన సమాధానం మాత్రం లభించడం లేదు.
ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ వైసీపీని తీవ్రంగా విభేదిస్తున్నారు. వైసీపీ విముక్త ఏపీకి గట్టిగానే పోరాడుతున్నారు. ఈ క్రమంలో జగన్ తో పాటు వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. దీంతో ఎల్లో మీడియా ప్రత్యేకంగా ఫోకస్ పెంచింది. పవన్ కు ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. చంద్రబాబు, లోకేష్ లకు సైతం ప్రాధాన్యత తగ్గించి.. పవన్ కు ప్రయోరిటీ ఇవ్వడంపై టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ ను భుజానికి ఎత్తి మోయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా అయితే ప్రజలకు రాంగ్ ఫీడ్ బ్యాక్ వెళుతుందని భయపడుతున్నాయి.
జనసేన ఆవిర్భావం నుంచి ఎల్లో మీడియా కవరేజ్ అంతంత మాత్రమే. టిడిపికి అవసరమైనప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా జనసేనను చూపించడం ఎల్లో మీడియాకు అలవాటైన విద్య. ఇటీవల వారాహి యాత్రకు ఎల్లో మీడియా ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది. దీనికి కారణం వైసిపి నేతలపై జగన్ విరుచుకుపడడమే. ఎల్లో మీడియా పతాక శీర్షికలో కథనాలు వార్తలు రాసుకునేందుకు వీలుగా పవన్ తన ప్రసంగాలను సాగించారు. దీంతో ఎల్లో మీడియా గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ కు ప్రత్యేకంగా చోటు ఇచ్చింది. పతాక శీర్షికలో కథనాలు రాసింది. ఈ తరుణంలో చంద్రబాబుకు లోకేష్ కు ప్రాధాన్యత తగ్గించింది. ఇటువంటివి కచ్చితంగా పార్టీకి నష్టం చేస్తాయని టిడిపి శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఎల్లో మీడియా చర్యలను తప్పుపడుతున్నాయి. వాటితో పార్టీకి లాభం కంటే నష్టమే అధికమని భావిస్తున్నాయి.