Homeఆంధ్రప్రదేశ్‌TDP Mahanadu 2022: టీడీపీలో ‘మహా’ జోష్.. శ్రేణులకు టానిక్ లా పనిచేసిన మహానాడు

TDP Mahanadu 2022: టీడీపీలో ‘మహా’ జోష్.. శ్రేణులకు టానిక్ లా పనిచేసిన మహానాడు

TDP Mahanadu 2022: తెలుగుదేశం పార్టీకి మహానాడు ద్వారా పునరుజ్జీవం వచ్చిందా? గత ఎన్నికల్లో ఓటమి తరువాత నైరాశ్యంలోకి వెళ్లిన టీడీపీ శ్రేణులకు మహానాడు టానిక్ లా పనిచేస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒంగోలులో జరిగిన మహానాడుకు కనీవినీ ఎరుగని రీతిలో జనం రావడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం తొణికిసలాడుతోంది. మళ్లీ అన్న ఎన్టీఆర్‌ రోజులు గుర్తుకొన్నారు. ఆయన జమానాలో మహానాడు నిర్వహిస్తే ఇసుకేస్తే రాలనంతగా జనం వచ్చేవారు. పార్టీ పండగలో పాల్గొనేందుకు టీడీపీ నేతలు, శ్రేణులే కాదు.. సాధారణ ప్రజలు సైతం ఉత్సాహంతో ఉరకలు వేసేవారు. కిలోమీటర్ల మేర రోడ్లపై ఉరుకులు పరుగులు పెట్టేవారు. ఈసారి ఒంగోలులో జరిగిన మహానాడు ఆ స్థాయిలో జరిగిందని.. తరలివచ్చిన జనసందోహాన్ని చూసి చెప్పక తప్పదని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.. అంతే కాదు.

TDP Mahanadu 2022
chandrababu

జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడేళ్లుగా దాడులు, కేసులతో టీడీపీ కార్యకర్తలు ఊపిరాడలేదు. గట్టిగా ఏడాదిన్నర క్రితం వరకు చాలా మంది నేతలు ఇంటి నుంచి బయటకు అడుగే పెట్టలేని పరిస్థితి. ఆర్థికంగా, భౌతికంగా అష్టదిగ్బంధం చేయడంతో విలవిలలాడారు. ఏ కార్యక్రమం చేపట్టినా కరోనా పేరిట అధికార యంత్రాంగం అడ్డుకోవడం, కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారింది. ఆ కష్టాలు, ఇబ్బందుల నుంచి బయటపడాలంటే టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురాక తప్పదని కార్యకర్తలకు అర్థమైంది. మహానాడు రూపంలో వారి ఆకాంక్ష ప్రస్ఫుటంగా బయటపడింది. శనివారంనాటి బహిరంగ సభకు జనం ఉప్పొంగడం చూశాక.. మూడేళ్లుగా పార్టీ శ్రేణుల్లో నెలకొన్న స్తబ్ధత మటుమాయమెనట్లు తెలిసిపోతోంది. వారిలో కొత్త ఉత్సాహం, కసి ఉరకలేస్తున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి.. తెలంగాణ నుంచి కూడా జనం భారీగా.. అందునా స్వచ్ఛందంగా తరలిరావడం.. ముఖ్యంగా మహిళలు, యువత కదం తొక్కడం పార్టీ అధినేత చంద్రబాబును, నేతలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. లక్షలాదిగా వచ్చిన ప్రజలను చూసి.. ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోతుందని ఆనందోత్సాహాలతో చంద్రబాబు కితాబిచ్చారు.

Also Read: Kaivalya Reddy Meets Lokesh: టీడీపీ వైపు ఆనం రామనారాయణరెడ్డి చూపు? లోకేష్ తో కుమార్తె కైవల్యారెడ్డి భేటీ

ఆంక్షలకు లెక్క చేయకుండా..
వాస్తవానికి మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధించింది. కానీ మహానాడు బహిరంగసభ దిగ్విజయం కావడంతో అధికార పార్టీలో కలవరం ప్రారంభమైంది. రవాణా ఏర్పాట్లు లేకపోయినా.. బస్సులు, వాహనాలను ఏర్పాటు చేయకపోయినా టీడీపీ శ్రేణులతో పాటు అభిమానులు, సాధారణ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. బహిరంగసభ వేదికకు ఆమడ దూరంలోనే పోలీసు యంత్రాంగం వాహనాలను నిలిపివేసినా.. ట్రాఫిక్‌ అడ్డంకులు ఏర్పడినా.. మండుటెండలోనూ జనం వెనక్కి మళ్లలేదు. వాహనాలను రోడ్లు పక్కనే వదిలేసి.. కిలోమీటర్ల దూరం కాలినడకన, పరుగులు తీస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నా లెక్కచేయకుండా మధ్యాహ్నం 12 గంటలకే వేల సంఖ్యలో వేదిక వద్దకు చేరుకున్నారు.

TDP Mahanadu 2022
TDP Mahanadu 2022

సాయంత్రానికి సంఖ్య లక్షలు దాటింది. సుమారు మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన ప్రజలు అక్కడే గుమికూడి నిలబడి జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్‌, కాబోయే సీఎం చంద్రబాబు అంటూ నినదించడం గమనార్హం. చంద్రబాబు ప్రసంగం ముగించే సమయానికి కూడా ప్రజలు బహిరంగసభ వేదిక వద్దకు వస్తూనే ఉన్నారు. పోలీసులు వాహనాల టైర్లలో గాలితీయడం, ద్విచక్ర వాహనదారులపై కేసులు రాయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అయినా జనం వాహనాలు దిగి నినాదాలతో సభావేదిక వద్దకు రావడం నిజంగానే అద్భుత సన్నివేశంలా కనిపించింది. దీంతో పోలీసులు, నిఘావర్గాలు కంగు తిని ఇక అడ్డుకుని లాభం లేదని గ్రహించి చేతులెత్తేశారు.

ట్రాక్టర్లు, లారీల్లో..
ప్రభుత్వం బస్సులు ఇవ్వకుండా అడ్డుకోవడంతో ప్రజలు అందుబాటులో ఉన్న ట్రాక్టర్లు, లారీలు, బైకులపై స్వచ్ఛందంగా తరలివచ్చారు. చూసినవారంతా 15 ఏళ్ల క్రితం నాటి వాహన శ్రేణి కన్పించిందని వ్యాఖ్యానించారు. రోడ్లపైనే, పార్కింగ్‌ స్థలాల్లో వేల సంఖ్యలు ట్రాక్టర్లు, లారీలు, బైకులు కనిపించాయి. చంద్రబాబు కూడా తన ప్రసంగంలో ప్రజలు తరలివచ్చిన వాహనాలు చూస్తుంటే పాతరోజులు గుర్తుకొచ్చాయని వ్యాఖ్యానించారు. వీటితో పాటు కార్లు, పెద్దఆటోలు, మినీ బస్సులు ఇతర వాహనాలు కూడా వేల సంఖ్యలో కనిపించాయి. ఒంగోలు చుట్టుపక్కల ఆగిపోయిన వాహనాలు 50 వేలకుపైనే ఉంటాయి.
బాబు ప్రసంగానికి భారీ స్పందనచంద్రబాబు వేదికపైకి రాగానే సభికులు విశేషంగా స్పందించారు. దాదాపు ఐదు నిమిషాల పాటు జేజేలు, జిందాబాద్‌లు, ఈలలు, కాబోయే సీఎం అంటూ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. ఇలాంటి స్పందన గత మహానాడుల్లో ఎప్పుడూ కనిపించలేదని సీనియర్‌ నాయకులు అన్నారు. మూడేళ్లుగా నిద్రాణంగా ఉన్న కసి, పార్టీని మళ్లీ ఎలాగైనా అధికారంలోకి తేవాలన్న ఉత్సాహం శ్రేణుల్లో కనిపించిందని చెప్పారు.

Also Read:TDP Mahaanadu: జగన్ ను ఓడించి ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాగలడా?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version