టీడీపీ గతంలో ఎన్నడూలేని ఒడిదుడుకులను ప్రస్తుతం ఎదుర్కొంటోంది. 2019 ఎన్నికల్లో ఏపీలో ఫ్యాన్ గాలి ప్రభంజనం సృష్టించడంతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ఇటీవలే జగన్ ఏడాది పాలన కూడా పూర్తి చేసుకున్నా టీడీపీ మాత్రం గత ఎన్నికల ఓటమి నుంచి బయటపడటం లేదనే టాక్ విన్పిస్తోంది. ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడాల్సిన విజయవాడ టీడీపీ నేతలు ఆధిపత్య పోరుకు సిద్ధమవుతున్నారు. ఒకరిపై ఒకరు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది.
Also Read: నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం..!
విజయవాడలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కిందటి ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ ఎంపీగా కేశినేని నానీ, తూర్పు ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ మాత్రమే గెలుపొందారు. దీంతో వీరిద్దరే విజయవాడలో పార్టీని ముందుకు నడుపుతున్నారు. గద్దె కొంత సైలంట్ ఉన్నా కేశినేని నాని మాత్రం బెజవాడలో దూకుడుగా వెళుతున్నారు. దీంతో కొందరు నేతలు ఆయన తమపై చేస్తున్న పెత్తనాన్ని సహించలేక పోతున్నారట. ఈ విషయాన్ని ఇప్పటికే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన పట్టించుకోకపోవడంతో స్థానిక నేతలే ఆయనకు ఆదిపత్యానికి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు.
Also Read: అయ్యో పాపం చంద్రబాబు నాయుడు
కేశినేని పెత్తనం తమపై ఎక్కువైందని రగిలిపోతున్న టీడీపీ నేతలు ఆయన కూతురుని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన తమపై పెత్తనం చేస్తున్నారని.. ఇక ఆయన కూతురు విజయవాడ మేయర్ అయితే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఆయన కూతురుని మేయర్ ఎన్నికల్లో ఓడించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ విషయం కేశినేనికి తెలియడంతో సదరు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
దీంతో బెజవాడలో టీడీపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. పార్టీ గడ్డుపరిస్థితుల్లోనూ నేతలు ఆధిపత్య పోరుకు తెరలేపడంతో చంద్రబాబు తలపట్టుకుంటున్నారట. ఈ సమస్యను బాబు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే..!