నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించకుండా ఉండేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నం చేసిన ప్రభుత్వం… చివరి ఏ మార్గం లేకపోవడం, సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో వెనక్కి తగ్గక తప్పలేదు. ఎట్టకేలకు నిమ్మగడ్డను ఎస్ఇసిగా నియమిస్తూ గురువారం అర్ధరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి నుంచి సాగుతున్న ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లయ్యింది. నిమ్మగడ్డ హై కోర్టులో ప్రభుత్వంపై దాఖలు చేసిన కోర్టు దిక్కార పిటీషన్ పై సుప్రీం కోర్టుకు స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై గత శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ ప్రారంభించింది. కోర్టు దిక్కార పిటీషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేది లేదని సుప్రీం తేల్చి చెప్పింది. వచ్చే శుక్రవారంలోగా ఈ వ్యవహారాన్ని తేల్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీం కోర్టులో ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన ప్రభుత్వం చివరి నిముషంలో గురువారం అర్ధరాత్రి నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు ఇచ్చింది. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో తనకు ఓ అవకాశాన్ని అట్టిపెట్టుకుంది. సుప్రీంలో కోర్టులో విచారణలో ఉన్న కేసు తుది తీర్పును అనుసరించి ఉత్తర్వులు అమలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టులు తమకు అనుకూలంగా తీర్పువస్తే నిమ్మగడ్డను తొలగించాలనే ఆలోచనతో ఉంది.
Also Read: అయ్యో పాపం చంద్రబాబు నాయుడు
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను టిడిపి ప్రభుత్వం 2106లో ఎన్నికల కమిషనర్ గా నియమించింది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆయన ఐదేళ్ళ పాటు పదవిలో కొనసాగుతారు. 2020 మార్చిలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ను ఇచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హింసాత్మక సంఘటనలు, భారీ స్థాయిలో పదవులు ఏకగ్రీవం కావడం వంటి విషయాలు అసాధారణంగా ఉండటం, ప్రతిపక్ష్లాలు ఆయనకు వినతిపత్రాలు అందజేయడంతో అభ్యంతరాలు ఉన్న చోట్ల విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో రాష్ట్రంలోకి కరోనా వైరస్ ప్రవేశించడం, కేసులు నమోదు అవుతున్న సమయంలో… ఇతర ప్రాంతాల్లో పరిస్థితులను గుర్తించిన రమేష్ కుమార్ ఎన్నికలను నిర్వహిస్తే వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతుందని అంచనా వేసి ఎన్నికలను వాయిదా వేస్తూ మార్చి 15వ తేదీన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిమ్మగడ్డను తొలగించే అవకాశాలపై దృష్టి పెట్టారు. తరువాతి కాలంలో నిమ్మగడ్డను తొలగించేందుకు ప్రత్యేకంగా ఆర్డినెన్స్ ను తీసుకువచ్చింది.
Also Read: కాంగ్రెస్ పార్టీకి మాయావతి జలక్?
ఆర్డినెన్స్ ఆధారంగా నిమ్మగడ్డను ఎస్ఇసి పదవి నుంచి తొలగించిన ప్రభుత్వం ఆ స్థానంలో తమిళనాడుకు చెందిన జస్టిస్ కనగరాజ్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించింది. కొద్ది రోజుల పాటు కమిషనర్ గా పని చేసిన ఆయన హై కోర్టు ఎస్ఇసి పదవి కాలాన్ని కుదిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని కొట్టేసింది. ప్రభుత్వం కనగరాజ్ ను ఎస్ఇసిగా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో కనగరాజ్ ఎస్ఇసి పదవి నుంచి తప్పుకున్నారు. తీర్పు ఇచ్చిన నాటి నుంచి ఎస్ఇసిగా నిమ్మగడ్డ పదవిలో కొనసాగుతారని హై కోర్టు ఆదేశించింది. అనంతరం ప్రభుత్వం నిమ్మగడ్డను ఎస్ఇసిగా నియమించకుండా తీర్పుపై సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై విచారించిన సుప్రీం కోర్టు మధ్యంత ఉత్తర్వులు ఇవ్వకపోగా, హై కోర్టు తీర్పును సమర్ధించింది. అనంతరం సుప్రీం కోర్టు, హై కోర్టులలో పలు పిటీషన్ లను ప్రభుత్వం దాఖలు చేసినా ప్రభుత్వానికి ఎక్కడా ఊరట లభించలేదు. హై కోర్టు ఆదేశాల ప్రకారం గవర్నర్ ను నిమ్మగడ్డ కలిసి తనను ఎన్నికల కమిషనర్ గా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హై కోర్టు తీర్పును అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇటీవల ప్రభుత్వానికి సూచించారు. ఈ వ్యవహారంలో ఎట్టకేలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ దే పైచేయి అయ్యింది.