Vangaveeti Radhakrishna Marriage: వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వివాహ మహోత్సవం ఖరారు అయ్యింది. అక్టోబర్ 22వ తేదీ ఆదివారం రాత్రి 7.59 నిమిషాలకు శ్రావణ నక్షత్ర వృషభ లగ్నం ను శుభ ముహూర్తంగా పెద్దలు నిర్ణయించారు. ఇప్పటికే నిశ్చితార్థ వేడుకలు పూర్తయిన సంగతి తెలిసిందే. కాగా వివాహ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇరు కుటుంబాల వారు వివాహ ఆహ్వాన పత్రికల పంపిణీని ప్రారంభించారు.
నరసాపురానికి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ జక్కం బాబ్జి, అమ్మా నీ దంపతుల రెండో కుమార్తె పుష్పవల్లితో గత నెలలో నిశ్చితార్థం జరిగింది. 1987- 92లో అమ్మాని నరసాపురం మున్సిపల్ చైర్ పర్సన్ గా వ్యవహరించారు. టిడిపిలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తరువాత వ్యాపార రీత్యా హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇటీవలే నరసాపురం వచ్చారు. జనసేనలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా గోదావరి జిల్లాలో పర్యటించిన సమయంలో వీరి ఇంట్లోనే బస చేశారు. పుష్పవల్లి ప్రాథమిక విద్యాభ్యాసం నరసాపురం లోనే జరిగింది.ఉన్నత విద్యాభ్యాసం హైదరాబాదులో జరిగింది. అక్కడే యోగా టీచర్ గా పని చేసేవారు. నరసాపురంలో ఓ ప్రైవేటు విద్యాసంస్థలో కీలక భాగస్వాముగా ఉన్నారు.
వంగవీటి రంగా జయంతి వేడుకలకు గాను వంగవీటి రాధా నరసాపురం వచ్చారు. బాబ్జి ఇంట్లోనే బస చేశారు. ఆ సమయంలోనే వివాహ ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వివాహ నిర్ణయానికి వచ్చారు. విజయవాడ నిడమనూరులోని పోరంకి రోడ్డు మురళి రిసార్ట్స్ లో వివాహం జరగనుంది. రంగా అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. అన్ని రాజకీయ పార్టీల నేతలకు వివాహ ఆహ్వానాలు అందిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.