TDP-Janasena List : ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ రాకముందే ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార వైసిపి మాత్రమే ఇప్పటిదాకా అభ్యర్థులను ప్రకటించింది. పోటీలో మేము సైతం అంటూ జనసేన, టిడిపి కూటమి శనివారం అభ్యర్థులను ప్రకటించింది. టిడిపి 94 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను, జనసేన ఐదు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా 118 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశామని చెప్పినప్పటికీ.. రెండు పార్టీల నుంచి 99 మంది పేర్లను మాత్రమే వెల్లడించారు. మొదటి జాబితాలో టిడిపికి 94.. జనసేనకు ఐదు సీట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. టిడిపి 94 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. జనసేన కేవలం ఐదుగురు పేర్లు మాత్రమే వెల్లడించింది. మిగతా 19 మంది పేర్లను తర్వాత ప్రకటిస్తామని జనసేన అధినేత ప్రకటించారు. టిడిపి, జనసేన కూటమి చెపుతున్నట్టు 118 స్థానాల్లో అభ్యర్థులు ఖరారయితే.. మిగతా 57 స్థానాల్లో పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా ఉంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటివరకూ టిడిపి జనసేన కూటమిలోకి బిజెపి రాలేదని తెలుస్తోంది. పొత్తులకు సంబంధించి చర్చలు పూర్తయినట్టు చంద్రబాబు చెప్పినా అదంతా టిడిపి అనుకూల మీడియా సృష్టి అని తేలిపోయింది. వచ్చేవారం బిజెపితో పొత్తుకు సంబంధించి ఒక స్పష్టత వస్తుందని.. అందుకోసమే వారు అడుగుతున్న సీట్లను ప్రస్తుతం పక్కన పెట్టారని తెలుస్తోంది. బిజెపి తక్కువలో తక్కువ పది నుంచి 20 సీట్లు అడుగుతుందని.. ఇందులో 15 సీట్ల వరకు కేటాయించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ 15 సీట్లలో బిజెపి గెలిచే స్థానాలు ఎన్ని? అనే ప్రశ్న తలెత్తుతోంది. బిజెపి కోరిన సీట్లు మొత్తం కేటాయిస్తే అంతిమంగా వైసిపి కి లాభం చేకూరుతుందని టిడిపి నాయకులు ఆందోళన చెందుతున్నారు. వైసిపి ఓటమికి కూటమి కడితే.. ఇలా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అంతిమంగా ఆ పార్టీకి బలం చేకూర్చుతుందని వారు అంటున్నారు.
తొలి జాబితాలో 118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని టిడిపి జనసేన కూటమి చెబుతున్న నేపథ్యంలో.. రెండవ విడతలో మిగతా 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. బిజెపి కోరుతున్నట్టుగా 15 స్థానాలు కేటాయిస్తే.. మిగతా 42 స్థానాలు టిడిపికి మిగులుతాయి. ఈ 42 స్థానాలు టీడీపీకి అత్యంత కీలకం. బిజెపికి కేటాయించే 15 స్థానాల్లో దాని ఓటు బ్యాంకు ఎంత? ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది? అనే ప్రశ్నలు ప్రస్తావనకు వస్తే సమాధానం చెప్పడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ స్థానాల్లో బిజెపి ఎన్నడూ గెలిచిన దాఖలాలు లేవు. ఇక్కడ మెజారిటీ ఓటు బ్యాంకు ఆ పార్టీకి బదిలీ అయ్యే పరిస్థితులు లేవు. అలాంటప్పుడు బిజెపికి కేటాయించే స్థానాల్లో వైసిపి గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బిజెపి కూడా తనకు కేటాయించే స్థానాల్లో అటు జనసేన, ఇటు టిడిపి క్యాడర్ ను నమ్ముకుని మాత్రమే బరిలోకి దిగాల్సి ఉంటుంది. అప్పుడు ఆ రెండు పార్టీల నుంచి బిజెపికి ఓటు బదిలీ అవుతుందా? అనేది ఒకింత ప్రశ్నార్థకమే.. అలాంటప్పుడు టిడిపి, జనసేన త్యాగం చేసే సీట్లు కచ్చితంగా వైసీపీ ఖాతాలోకి వెళ్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..