Chandrababu-Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పటికే పలు విడతల్లో అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఎన్నికలకు సిద్ధం అంటూ ప్రచార సభలు నిర్వహిస్తున్నారు సీఎం జగన్. ఈ క్రమంలో తాజాగా టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా శనివారం తమ ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. దీంతో ఎన్నికల హీట్ ఒక్కసారిగా పెరిగింది.
త్రిముఖ పోటీ..
2024 ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ ఒంటరిగా బరిలో దిగుతుండగా, టీడీపీ, జనసే, బీజేపీ కూటమి, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మరో కూటమిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రెండు కూటముల లక్ష్యం వైసీపీని ఓడించడమే. ఎన్నికల తర్వాత కూటమి కొనసాగుతుందా లేదా అనేది అనుమానమే. ఇక వైసీపీ తమకు జెండాలతో పొత్తు కాదని, జనంతోనే పొత్తని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆశీస్సులతో గెలుస్తామని పేర్కొంటున్నారు.
పెద్దిరెడ్డి టార్గెట్‌గా..
ఇదిలా ఉండగా, వైసీపీ ప్రభుత్వంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ. వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీ టార్గెట్‌గా టీడీపీ, జనసేన వ్యూహం రచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు ప్లాన్ చేశాడు. ఇక్కడి నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిని కాదని మరో నాయకుడికి టికెట్ ఇచ్చారు.
చివరి నిమిషంలో అభ్యర్థి మార్పు..
తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు శంకర్ ఇక్కడ టికెట్ ఆశించారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మి దేవమ్మ, ఆమె కుమారుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కూడా టికెట్ ఆశించారు. అయితే మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ సామాజికవర్గం(బీసీ) కావడం, తంబళ్లపల్లెలో ఓ సమాజికవర్గం ఓట్లు అధికంగా ఉండడంతో బాబు, పవన్ చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చేశారు. జయచంద్రారెడ్డిని రంగంలోకి దింపారు.
రెడ్డి, బలిజ ఓట్ల కోసం..
తంబళ్లపల్లెలో బలిజ, రెడ్డి సామాజిక ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత బీసీలు, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గ ఓట్లు చీల్చాలని, లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ తీసుకువచ్చి పెద్ది రెడ్డి సోదరుడి ఓడించేలా ప్లాన్ చేశారు. జయచంద్రారెడ్డి ఇటీవలే అధికార వైసీపీ నుంచి టీడీపీలో చేరాడు. జయచంద్రారెడ్డిని పెద్దిరెడ్డి ఫ్యామిటీ ఇబ్బందులు పెట్టిందని ప్రచారం ఉన్న నేపథ్యంలో సానుభూతి ఓట్లు కలిసి వస్తాయని జనసే, టీడీపీ కూటమి భావిస్తోంది. అయితే అపర చాణక్యుడు అయిన పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి తన సోదరుడు ద్వారకనాథరెడ్డిని పక్కా ప్లాన్‌తో గెలిపించుకుంటాడన్న చర్చ కూడా జరుగుతోంది.
ప్రతీకారం కోసమే…
కుప్పంలో తనను దెబ్బకొట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీని దెబ్బతీయడమే లక్ష్యంగా టీడీపీ అధినేత ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న శంకర్‌కు నచ్చజెప్పి తంబళ్లపల్లె టికెట్‌ను జయచంద్రారెడ్డికి ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి చంద్రబాబు ప్రతీకారం తీరుతుందా లేదా అనేది చూడాలి.