TDP Meeting: 28 సంవత్సరాల తర్వాత చంద్రబాబు లేకుండా టిడిపి సమావేశం

ఈనెల 21న అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టిడిపి రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్టు తరువాత రాష్ట్రస్థాయి సమావేశం ఇంతవరకు నిర్వహించలేదు.

Written By: Dharma, Updated On : October 19, 2023 11:17 am

TDP Meeting

Follow us on

TDP Meeting: తెలుగుదేశం పార్టీకి కర్త, కర్మ,క్రియ చంద్రబాబే. 1995 ఆగస్టులో ఎన్టీఆర్ నుంచి పార్టీ హస్తగతం చేసుకున్న తర్వాత 14 సంవత్సరాల పాటు పార్టీని అధికారంలో ఉంచగలిగారు. మరో 14 సంవత్సరాల పాటు ప్రధాన ప్రతిపక్షంలో పార్టీని కొనసాగించడంలో సక్సెస్ అయ్యారు.ఒక విధంగా చెప్పాలంటే జాతీయ స్థాయిలో సైతం తెలుగుదేశం పార్టీ ఉనికిని చాటి చెప్పారు. అటువంటి నాయకుడు ఇప్పుడు అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లారు. కోర్టుల్లో ఉపశమనం దక్కక జైలుకే పరిమితమయ్యారు. ఇప్పుడు చంద్రబాబే లేకుండా టిడిపి రాష్ట్రస్థాయి సమావేశం జరుగుతుండడం తీరని లోటే.

ఈనెల 21న అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టిడిపి రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్టు తరువాత రాష్ట్రస్థాయి సమావేశం ఇంతవరకు నిర్వహించలేదు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ పై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటికే లోకేష్ చంద్రబాబుతో మాట్లాడారు. అనంతరం అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. విజయవాడలో నిర్వహించే పార్టీ విస్తృత స్థాయి సమావేశం గురించి చర్చించారు. చంద్రబాబు ఆదేశాలతోనే రాష్ట్రస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

ఎన్నికలు సమీపిస్తున్నాయి.అధినేత చూస్తే జైల్లో ఉన్నారు. 40 రోజులుగా పార్టీ కార్యక్రమాలు స్తంభించాయి. ఎన్నికల ఆరు నెలలపాటు ప్రజలతో మమేకమయ్యేందుకు చంద్రబాబు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నారు. అమలుకు ప్రత్యేక వ్యవస్థను సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఇంతలోనే ఆయన అరెస్టు జరిగింది. అప్పటినుంచి టిడిపి శ్రేణులు చంద్రబాబు అరెస్టు పైన ఎక్కువగా పోరాడుతున్నాయి. ఈ తరుణంలో అధికార వైసిపి తెలుగుదేశం పార్టీపై ప్రచారం ప్రారంభించింది. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి చంద్రబాబు అరెస్టుపైనే పోరాడుతోందని తెలుగుదేశం పార్టీపై నిందలు వేస్తోంది. అటు సోషల్ మీడియాలో సైతం ఇదే రకమైన ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలోనే పార్టీ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలి అన్న యోచనలో రాష్ట్రస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

చంద్రబాబు లేకుండా తొలిసారిగా సమావేశం నిర్వహించడం గత 28 సంవత్సరాల్లో ఇదే తొలిసారి. దీంతో అందరి దృష్టి ఈ సమావేశం పైన పడింది. అయితే ఈ సమావేశంలో లోకేష్ నాయకత్వంలో ముందుకు సాగుతామని తీర్మానించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తు కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహణ, జనసేనతో పొత్తు సమన్వయం, టిక్కెట్ల ఖరారు వంటి వాటిపై రాష్ట్రస్థాయి సమావేశంలో ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే చంద్రబాబు లేకపోవడంతో లోకేష్ ఎలా డీల్ చేస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అటు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి సేవలను ఎలా వినియోగించుకుంటాం అన్నదానిపై సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. మొత్తానికైతే చంద్రబాబు లేకుండా సమావేశం నిర్వహిస్తుండడం లోటే.