
చుక్కాని లేని నావలా ఉన్న తెలంగాణ టీడీపీకి గట్టి షాక్ తగిలింది. తెలంగాణలో టీడీపీని వదిలేసి ఏపీకి వలసపోయిన చంద్రబాబు ఇక్కడ పార్టీని ఎప్పుడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. హైదరాబాద్ లోనే చంద్రబాబు ఎక్కువగా నివాసం ఉంటున్నా.. ఈ రాష్ట్రంలో మాత్రం తెలుగు దేశాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.
తాజాగా ఆఖరుకు మిగిలి ఉన్న తెలంగాణ నాయకులు కూడా టీడీపీని వీడుతున్నారు. దీంతో తెలంగాణలో సంపూర్ణంగా టీడీపీ ఇక టీఆర్ఎస్ కానుంది. కేసీఆర్ కూడా ఒకప్పుడు టీడీపీ నుంచే రావడంతో ఇక టీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ తెలుగుదేశంగా పిలవచ్చు.
తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ టీఆర్ఎస్ చేరేందుకు మార్గం సుగమమైంది. ఎమ్మెల్సీ పదవిపై హామీ లభించడంతో ఎల్. రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఈ వారంలోనే ఎల్. రమణ టీఆర్ఎస్ లో చేరే అవకాశాలు కనపడుతున్నాయి.
తెలంగాణలో ఈటల రాజేందర్ లాంటి బలమైన బీసీ నాయకుడిని పార్టీ నుంచి పంపించిన నేపథ్యంలో ఆయన స్థానంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో బలమైన బీసీ నేత కోసం టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే ఎల్. రమణను టీఆర్ఎస్ లో చేర్చుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు ఆయన కూడా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఎల్. రమణతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఎల్. రమణకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఎర్రబెల్లి హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఎల్. రమణ సైతం సన్నిహితులతో చర్చించి పార్టీలో చేరికకు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.