
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. వారం పది రోజుల్లో టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం సాగుతోంది. తన మద్దతుదారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని స్వయంగా ఆయనే చెప్పారు. టీడీపీని వదిలేయడానికి రమణ డిసైడ్ చేసుకున్నట్లు అర్థమైపోతోంది. కాకపోతే ముహూర్తం ఎప్పుడన్నది తెలియలేదు. రాష్ర్ట విభజన తరువాత తెలంగాణలో టీడీపీ బలహీనపడిందన్నది వాస్తవం. దీంతో పాటు ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడ పారిపోయి తెలంగాణ రాజకీయాల్లో కనిపించలేదు.
గడిచిన పదేళ్లలో టీడీపీ అధ్యక్షుడుగా రమణ కొనసాగారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన రమణ తప్ప పార్టీకి పెద్ద దిక్కు ఎవరు లేరు. దీంతో ఆయనే నెట్టుకొస్తున్నారు. రమణ స్ధానంలో మరొకరు రావడానికి సిద్ధపడడం లేదు. కొత్తగా ఎవరొచ్చినా ఒరిగేదేమి లేదు. అందుకే రమణనే ఇన్నాళ్లు నామమాత్రంగా పదవి నిర్వహిస్తున్నారు. దాదాపుగా తెలంగాణలో పార్టీ కోమాలో ఉన్నట్లే లెక్క.
తెలంగాణలో టీడీపీ ఉందంటే ఉందన్నట్లుగా ఉంది. పార్టీని వెన్నంటి ఉండే నేతలు కరువయ్యారు. అందరు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్లారు. ఏ పార్టీలో చేరని వారే మిగిలిపోయారు. ఈ పరిస్థితుల్లో ఎల్. రమణ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లు పార్టీని పట్టుకుని తిరిగిన నాయకుడు కూడా వెళ్లిపోతే ఇక తెలంగాణలో దుకాణం మూసినట్లే అని అంటున్నారు. చంద్రబాబు సైతం తెలంగాణపై పెద్దగా దృష్టి సారించడం లేదు.
తెలంగాణలో టీడీపీ బతికి బట్టకట్టేది లేదు. రాష్ర్టంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా చంద్రబాబు తిరిగే అవకాశాలు లేకే పార్టీ అంతర్మథనంలో పడింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో పార్టీ మనుగడ కష్టమే. దీంతో చంద్రబాబు తెలంగాణ గురించి పట్టించుకోవడం మానేశారని తెలుస్తోంది. టీడీపీ అధ్యక్షుడు రమణ పార్టీ వీడినా ఉన్నా ఒకటేనని భావిస్తున్నారు.