గ్రేటర్ నోటిఫికేషన్‌కు సమయం దగ్గరపడుతోంది. ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో అప్పుడే అన్ని పార్టీలూ కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే గ్రేటర్‌లో పాగా వేసేందుకు అధికార టీఆర్‌ఎస్ పార్టీ తాయిలాలు ప్రకటించేసింది. ఇక పంపిణీయే తరువాయి. మరోవైపు బీజేపీ గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. ఇప్పటికే డిపాజిట్లు కోల్పోతున్న కాంగ్రెస్ తన జవసత్వాలు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
Also Read: తెలంగాణ సర్కార్ ముందస్తు తాయిలాల కథ ఇదీ!
అయితే.. తెలుగుదేశం పార్టీ పరిస్థితి మాత్రం అంచనా వేయలేకుండా ఉంది. బల్దియా ఎన్నికల్లో ఒకప్పుడు మేయర్ స్థానాన్ని కూడా గెల్చుకున్న పార్టీ టీడీపీ. గత గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కనిపించడంతో ఒక్కటంటే ఒక్క కార్పొరేటర్ సీటునే దక్కించుకుంది. కానీ 2009లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీది నెంబర్ టూ స్థానం. 45 కార్పొరేటర్ సీట్లను గెల్చుకుంది
Also Read: వైరల్: జీహెచ్ఎంసీపై బీజేపీ ఓపెన్ ఆఫర్
ఇప్పటికి కూడా హైదరాబాద్‌లో టీడీపీ క్యాడర్ సైలెంట్ అయిపోయింది. తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఎల్ రమణ కూడా పెద్దగా పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టలేదు. కానీ.. గ్రేటర్‌లోని ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇతర పార్టీల్లో సీట్లు దక్కవనుకున్నా కొంత మంది సీనియర్లు మళ్లీ టీడీపీ గూటికి చేరుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ చేరికలు ఎక్కువయ్యాయి. గతంలో ఉన్నట్లుగా పరిస్థితి ఉండదని.. టీఆర్ఎస్ పరిస్థితి ఏమంత బాగోలేదని.. గ్రేటర్‌లో ప్రజల ఇబ్బందులు తీరలేదని.. ఇది ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
అందుకే.. డివిజన్ల వారీగా పోటీలో నిలిచేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. గ్రేటర్‌లో పోటీ విషయంలో క్లారిటీ ఇచ్చారు. టీడీపీ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ క్యాడర్‌ను ఆదేశించారు. దీన్ని బట్టి చూస్తుంటే.. గ్రేటర్‌లో టీడీపీ పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. టీడీపీ పోటీ చేస్తే ప్రధాన ప్రత్యర్థిగా కాలేకపోవచ్చు కానీ.. ఎక్కడిక్కడ నాయకుల బలం తోడైతే ప్రాధాన్య క్రమంలో ఓట్లు.. సీట్లు గెల్చుకునే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణలో దుకాణం సర్దేసిన టీడీపీ పోటీచేస్తే ఓట్లు రాకపోతే అంతకంటే అవమానం మరొకటి ఉండదని.. నవ్విపోతారని నేతలు భయపడిపోతున్నారు. మరి.. టీడీపీ ఏ పార్టీతోనైనా జతకడుతుందా.. లేక ఒంటరిగా పోటీకి సై అంటుందా చూడాలి.