TDP Boycott Assembly: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు అరెస్ట్ పై చర్చకు టిడిపి పట్టు పట్టింది. గత రెండు రోజులుగా డిమాండ్ చేస్తూనే ఉంది. కానీ స్పీకర్ తమ్మినేని సీతారాం నుంచి సానుకూలత రాలేదు. నిన్న అసెంబ్లీ ప్రారంభం నుంచి టిడిపి నిరసన చేపడుతూ వచ్చింది. టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టూ బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఒకరోజు పాటు సస్పెన్షన్ విధించారు.
రెండో రోజు సభ ప్రారంభంలో సైతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అదే నిరసనను కొనసాగించారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం కొందరిని ఐదు రోజులపాటు, మరికొందరిని ఒక్కరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ శాసనసభ సమావేశాలను బహిష్కరించినట్లు ప్రకటించింది. శాసనసభా పక్ష ఉప నేత, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెనాయుడు ప్రకటించారు. స్పీకర్ తీరును తప్పు పట్టారు. తమ్మినేని సీతారాం తనను యూస్ లెస్ ఫెలో అని సంబోధించారని అచ్చన్న ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ తాజా కామెంట్స్ శ్రీకాకుళం జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచాయి. జిల్లాలో ఎవరు యూస్ లెస్ ఫెలో లో అందరికీ తెలుసునని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. టిడిపిలో ఎదిగి.. కీలక పదవులు తెచ్చుకున్న తమ్మినేని.. ఊసరవెల్లి రాజకీయాలు నడుపుతున్నారని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కింజరాపు కుటుంబానికి, నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. అందుకే 2004 నుంచి 2019 వరకు ప్రజలు అధికారానికి దూరం చేశారని నేతలు గుర్తు చేస్తున్నారు. జగన్ ప్రభంజనంతోనే గెలిచిన విషయాన్ని గుర్తించుకోవాలని హితవు పలుకుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ్మినేని ఓటమి ఖాయమని.. అటువంటి నేత యూస్ లెస్ ఫెలో అని అచ్చెనాయుడు గురించి మాట్లాడడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ గా తమ్మినేని శాసనసభను నడిపించడంలో విఫలం అయ్యారని.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ రాజకీయాల కోసం ఆపసోపాలు పడుతున్న తమ్మినేని కి గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు.