ఏ ఎన్నికల్లో అయినా స్ట్రాంగ్‌గా ఉన్న పార్టీని ఓడించేందుకు మిగితా పార్టీలన్నీ జతకడుతుంటాయి. అన్ని పార్టీలు కలిసి కూటమిలా ఏర్పడుతుంటాయి. అలా చాలా సందర్భాల్లో చూశాం.. చూస్తూనే ఉన్నాం. అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి కూటమి కోసం తెలుగుదేశం పార్టీ తెగ ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్య అదే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అక్కడ వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఏ ఎన్నికల్లో అయినా ఆ పార్టీదే హవా కనిపిస్తోంది. ఇక దానిని ఢీకొట్టేందుకు టీడీపీ కొత్త పొత్తుల కోసం వేటసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పుడు జనసేన పార్టీ అక్కడ కింగ్‌మేకర్ అయింది. పవన్ ఏకంగా స్టార్ అయిపోయారు. ఇన్నాళ్లు సినిమాల వరకే పరిమితమైన స్టార్‌డమ్.. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోనూ అందుకుంటున్నారు. ఇప్పుడు ఆయన పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఒకరి తర్వాత ఒకరు ముందుకొస్తున్నారు. జనసేన ఇప్పటికే బీజేపీతో పొత్తులో నడుస్తుండగా.. తాజాగా తెలుగుదేశం పార్టీ పొత్తు కోసం ప్రయత్నిస్తోంది. పవన్‌ను టీడీపీ మళ్లించేందుకు తెలుగుదేశం అనుకూల శక్తులు ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి.
ఇప్పటికే తమ కూటమి తరఫున పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించేశారు. ఆ ప్రకటనతో జనసేన సైనికుల్లోనూ సంబరం కనిపించింది. అప్పటి నుంచి తిరుపతి ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించుకునేందుకు కృషి చేస్తున్నారు. అయితే.. టీడీపీకి ఎటూ పాలుపోవడం లేదు. జనసేనకు ఇటీవల జరిగిన లోకల్ ఎన్నికల్లోనూ.. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఓటు బ్యాంకు పెరిగింది. దీంతో భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి రావాలంటే ఇప్పటినుంచే జనసేనతో అండర్‌స్టాండింగ్‌లో వెళ్లాలంటూ ఆ పార్టీ సీనియర్ లీడర్లు అధినేతకు చెప్తున్నారట.
ఈ సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు కనుక పవన్‌ను పొత్తుకు ఆహ్వానిస్తే పవన్ ఎలా స్పందిస్తారో తెలియకుండా ఉంది. పవన్ కనుక విడిగా పోటీ చేస్తే ఓటుబ్యాంకు తప్పకుండా చీలుతుందని.. ఆ చీలే ఓటు బ్యాంకు కూడా టీడీపీదేననే ఆందోళన ఆ పార్టీలో కనిపిస్తోంది. బీజేపీ తమ కూటమి తరఫున పవనే సీఎం అభ్యర్థి అని అంటుండగా.. టీడీపీ సైడు జనసేన వెళ్తే అక్కడ సీఎం పదవి ఆశించే అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ చంద్రబాబో లేక ఆయన తనయుడు లోకేషో సీఎం పీఠం ఎక్కుతారు. ఈ సంగతి తెలిసి పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటారని ఎవరూ అనుకోవడం లేదు.