జస్టిస్ ఈశ్వరయ్యతో ఫోన్ సంభాషణ జరిపి పెనుదుమారం రేపిన జడ్జి రామకృష్ణను తాజాగా ఏపీ సర్కార్ టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. సీఎం జగన్ పై, ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనమైంది.
చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య బుధవారం జడ్జి రామకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని, జగన్ ను అస్తిరపరుస్తున్నారన్న ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 124ఏ కింద పీలేరు పోలీసులు ఏకంగా జడ్జి రామకృష్ణపై దేశద్రోహం కేసు నమోదు చేయడం సంచలనమైంది.
జడ్జి రామకృష్ణను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచగా.. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో రామకృష్ణను పీలేరు సబ్ జైలుకు తరలించారు.
*కేసుకు కారణమిదీ..
ఏప్రిల్ 12న జడ్జి రామకృష్ణ ఓ టీవీ చానెల్ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘జగన్ కంసుడిలా తయారయ్యాడని.. ఈ రాక్షసుడిని రాక్షస పాలనను అంతం చేయడానికి నేను కృష్ణఉడిగా భావించి జగన్ ను శిక్షించాలా అని ఎదురుచూస్తున్నాను’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎస్సీ వర్గానికి చెందిన జయరామచంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జడ్జి రామకృష్ణపై కేసులు నమోదుచేసి అరెస్ట్ చేశారు.