వైఎస్ కూతురు, జగన్ సోదరి షర్మిల మొత్తానికి మనసులో మాట బయటపెట్టేసుకున్నారు. పక్కన ఉన్న ఆమె నేతలు ఎవరూ డిమాండ్లు చేయకుండానే.. జోస్యాలు చెప్పకుండానే.. తనకు తానుగా కోరికను వెల్లడించేశారు. తాను తెలంగాణకు సీం అవుతానని, తాను సీఎం అయితే తప్ప, బంగారు తెలంగాణ సాధ్యం కాదని కూడా తీర్మానించేశారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కరించాలంటూ షర్మిల హైదరాబాద్ లో గురువారం దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. మూడు రోజులు అనుమతి కోరగా.. పోలీసులు ఒకరోజే పర్మిషన్ ఇచ్చారు. సమయం ముగిసినప్పటికీ దీక్ష విరమించకపోవడంతో.. పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించారు.
ఈ సందర్భంగా ఆమె ఆవేశంగా మీడియాతో మాట్లాడుతూ.. తాను తెలంగాణకు సీఎం అయిపోతానని ప్రకటించారు. తాను పార్టీ ప్రకటించిన రోజే పాదయాత్ర తేదీని కూడా ప్రకటిస్తానని.. రాష్ట్రంలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. షర్మిల పార్టీ ప్రకటించినప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు. కానీ.. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఎలా స్పందిస్తాయన్నది పక్కనబెడితే.. తెలంగాణలో అందుకు ఏ మేర అవకాశం ఉందన్నది ప్రధానాంశం.
రాష్ట్రంలో కావొచ్చు.. దేశంలో కావొచ్చు.. కొత్త పార్టీ ఒకటి పురుడు పోసుకొని, అది ఏపుగా ఎదిగి, అధికాకరం అనే ఫలాన్ని అందించాలంటే తప్పనిసరిగా రాజకీయ శూన్యత ఉండాలి. ప్రజలు ఎవరినీ విశ్వసించలేని పరిస్థితులు నెలకొనాలి. దేశంలో మోడీ ప్రభంజనం వీచడానికి కారణం ఇదే. పదేళ్లు పాలించిన యూపీఏ.. సహజ వ్యతిరేకతకు తోడు.. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం.. బీజేపీని మించిన ప్రత్యామ్నాయం లేకపోవడంతో ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారు. మరి, తెలంగాణలో ఆ పరిస్థితి ఉందా? అన్నది మొదటి ప్రశ్న.
ఇక, రెండోది సొంత రాష్ట్రం ఏపీని వదిలి.. పక్క రాష్ట్రం ప్రజల తరపున పోరాడుతామనడంలో విశ్వసనీయత ఎంత? అన్నది చాలా మందిని తొలుస్తున్న ప్రశ్న. అంటే.. ఏపీలో ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లుతున్నారని షర్మిల భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఆమెతోపాటు ఆమె పార్టీ నేతలు, కార్యకర్తలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ ఏర్పాటుకు బద్ధ వ్యతిరేకిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్రం ఏర్పడితే.. ఏపీ ప్రజలు వీసా తీసుకొని వెళ్లాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాంటి రాజన్న పాలన తెలంగాణలో తెస్తానంటూ బయలుదేరారు షర్మిల. మరి, ఈ మాటను తెలంగాణ ప్రజలు ఎంత వరకు విశ్వసిస్తారు? అన్నది మూడో ప్రశ్న.
అంతేకాకుండా.. తెలంగాణలో టీఆర్ఎస్ ఇంకా బలంగానే ఉందన్నది విస్మరించలేని అంశం. కాంగ్రెస్ లో నేతల కీచులాటలు మినహాయిస్తే.. సంప్రదాయ కేడర్ అలాగే ఉందన్నది కూడా కాదనలేని అంశం. ఇక, బీజేపీ కూడా బలం పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి వారిని వెనక్కు నెట్టి.. తెలంగాణ రాజకీయ మడిలో విత్తనాలు జల్లి.. బంగారు పంట పండించే అవకాశం ఎంత మేరకు ఉందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
దేశంలో ఎవరైనా.. ఎక్కడైనా రాజకీయం చేసుకోవచ్చు. కానీ.. ప్రజల విశ్వాసం ఎంత వరకు పొందగలరన్నదే కీలకం. మరి, షర్మిలను తెలంగాణ ప్రజలు ఎంత మేరకు విశ్వసిస్తారు అన్నది తేలాలంటే.. ఒక ఎన్నిక ఎదుర్కోవాల్సిందే.