BJP Plan On Telangana: దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రంగా తెలంగాణను బీజేపీ గుర్తించింది. ఈమేరకు ఇప్పటికే ఏడాదిగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఎన్నికలకు మరో పది నెలలకు మించి సమయం లేకపోవడంతో దూకుడు మరింత పెంచింది. ఈ ఏడాది 9 రాష్ట్రాల్లోల ఎన్నికలు జరుగనున్నాయి. దక్షిణాది నుంచి కర్నాటక తర్వాత బీజేపీ అధిష్టానానికి తెలంగాణ స్పష్టంగా కనిపిస్తోంది. ఈమేరకు వ్యూహరచన చేస్తోంది అధిష్టానం. ఈ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది . పార్టీలో పని చేస్తున్న కీలక నాయకులకు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కోసం టాస్క్‌లు అప్పగించింది. తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీకి రాజకీయ ప్రత్యామ్నయం బీజేపీ మాత్రమే అని చెప్పే ప్రయత్నం చేస్తున్న కమలనాథులు ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి దూకుడుగా ముందుకు వెళుతున్నారు.

మద్దతును ఓటు బ్యాంకుగా మార్చే ప్లాన్..
తెలంగాణా బీజేపీ నేతలకు కీలక టాస్క్ ఇచ్చింది అధిష్టానం.
ప్రజల్లో వస్తున్న మద్దతు ఓటు బ్యాంకుగా మారేలాగా అగ్ర నాయకులు తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులకు సూచిస్తున్నారు. ఈ మేరకు ఒక పకడ్బందీ వ్యూహం రచించి దానిని ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే బండి సంజయ్ పాదయాత్ర, ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రలతో దూకుడు మీదున్న బీజేపీ నేతలకు అధిష్టానం మరో కీలక బాధ్యతను అప్పగించింది.
సమష్టిగా ముందుకు..
క్షేత్ర స్థాయిలో బీజేపీ బలోపేతం కోసం అధిష్టానం నిర్ణయం
తెలంగాణ బీజేపీలో కీలక నాయకులు అందరూ ఎవరికివారు తమ ఇమేజ్ పెంచుకునేలాగా వివిధ కార్యక్రమాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. అయితే ఎవరికి వారు కాకుండా సమష్టిగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అనేకమార్లు సర్వేలు నిర్వహించిన బీజేపీ అధిష్టానం ఈ మేరకు పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసింది.
11 వేల సభలు, సమావేశాలు..
ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మరింత దూకుడు పెంచాలని నిర్ణయించిన బీజేపీ అధిష్టానం ఈమేరకు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే ఆలోచనలో ఉంది. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా 11 వేల సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.
నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలపడలేదని గుర్తించిన అధిష్టానం. గ్రామ, గ్రామానికి వెళ్లి ప్రజల మద్దతును కూడగట్టడం కోసం పార్టీలోని నాయకులందరూ పనిచేయాలని సూచించింది. స్ట్రీట్ కార్నర్ మీటింగులు, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీల బలోపేతం వంటి వాటితో క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మొదలుపెట్టి ఏకంగా 11 వేల సభలు, సమావేశాలు నిర్వహించాలని సూచించింది. అంతేకాదు 119 నియోజకవర్గాల తెలంగాణలో తొమ్మిది వేల శక్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రతీ 56 బూత్ కమిటీలకు ఒక శక్తి కేంద్రం ఉంటుందని పేర్కొంది.

ఫిబ్రవరి ఒకటి నుంచి రంగంలోకి
ప్రతీ గ్రామంలోనూ క్షేత్రస్థాయిలో బీజేపీ పని చేసేలా శక్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఇక బూత్ స్థాయిలో ఎన్నికల నిర్వహణ కోసం కమిటీలు వేయాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది. ప్రతీ శక్తి కేంద్రానికి ఒక ప్రముఖ్‌ను నియమించి మరీ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించాలని నిర్ణయించింది. ఇక ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నిత్యం ప్రజలకు కనిపించేలా వివిధ కార్యక్రమాలతో బీజేపీ దూకుడుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లనుంది. అంతేకాదు ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా వంటి అగ్ర నేతలు సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇక ఇదే సమయంలో నేతల కొరతను అధిగమించడం కోసం కూడా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల్లో ఉన్న బలమైన కీలక నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నం ప్రారంభించింది.
మొత్తంగా తెలంగాణలో ‘పవర్’ ప్లాన్‌ను ఫిబ్రవరి 1 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.