Srikakulam: వైసీపీ సర్కార్ ఐదేళ్ల పాలన ముగియనుంది. మరో నెల రోజులపాటు మాత్రమే వైసిపి పాలన కొనసాగనుంది. అసెంబ్లీ సమావేశాలు ముగిస్తున్నాయి. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం గత ఐదేళ్లుగా తనకు సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తాను నాలుగు స్పీకర్ అని.. తనకంటే ముందు ముగ్గురు పనిచేశారని.. వైసిపి హయాంలో జగన్ తనకు అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చారు. దీంతో శ్రీకాకుళం జిల్లా నుంచి నలుగురు స్పీకర్లు ప్రాతినిధ్యం వహించారు? వారు ఎవరు? అన్న చర్చ నడుస్తోంది. చాలామంది ఆరా తీయడం కనిపిస్తోంది. తమ్మినేని సీతారాం తో శ్రీకాకుళం జిల్లా నుంచి నలుగురు స్పీకర్లు పదవీ బాధ్యతలు చేపట్టారు. వారి గురించి తెలుసుకుందాం.
శ్రీకాకుళం జిల్లా నుంచి తొలిసారిగా రొక్కం నరసింహం దొర స్పీకర్ గా పని చేశారు. 1955 నుంచి 1956 వరకు ఏడాది పాటు స్పీకర్ గా వ్యవహరించారు. ఆంధ్ర రాష్ట్రానికి ఆయన రెండో స్పీకర్ గా గుర్తింపు పొందారు. 1983 నుంచి 1984 వరకు ఏడాదిన్నర పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన తంగి సత్యనారాయణ స్పీకర్ గా పని చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. స్పీకర్ గా తంగి సత్యనారాయణకు అవకాశం ఇచ్చారు. అటు తరువాత ప్రతిభా భారతి స్పీకర్ అయ్యారు. ఏపీ అసెంబ్లీ చరిత్రలోనే ఆమె తొలి మహిళా స్పీకర్ గా నిలిచారు. 1999 నుంచి 2004 వరకు ఐదేళ్ల పాటు స్పీకర్ గా పనిచేశారు. 2019లో వైసీపీ సర్కార్ అధికారంలోకి రావడంతో తమ్మినేని సీతారాం స్పీకర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు.
చివరిసారిగా 1999లో తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు సర్కారులో మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అటు తర్వాత 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మరోసారి పోటీ చేసి గెలుపొందారు. మంత్రి పదవి ఆశించారు. కానీ జగన్ మాత్రం ఆయనకు స్పీకర్ గా అవకాశం ఇచ్చారు. ఐదేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు.మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లా నుంచి నలుగురు నేతలు స్పీకర్లుగా పదవీ బాధ్యతలు చేపట్టడం విశేషం.