ఏపీ స్పీకర్ తమ్మినేని సీతరాం న్యాయవ్యవస్థ తీరుపై తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తమ్మినేని స్పీకర్ గా ఎన్నికయ్యారు. తమ్మినేని స్పీకర్ పదవీలో ఉన్నప్పటికీ వైసీపీ సర్కార్ కు అండగా నిలుస్తూనే ఉన్నారు. వీలుచిక్కినప్పుడల్లా జగన్ ను ఆకాశానికెత్తేస్తుంటారు. ఇకపై జగన్ సర్కార్ కు న్యాయ స్థానాల్లో ఎదురుదెబ్బలు తగిలిన ప్రతీసారి తమ్మినేని తనదైన శైలిలో తిప్పికొడుతున్నారు.
Also Read: ఫైట్ కు రె‘ఢీ’ అవుతున్న జగన్, చంద్రబాబు
తాజాగా గుజరాత్ లో జరిగిన స్పీకర్ల సదస్సులో తమ్మినేని పాల్గొని మాట్లాడారు. న్యాయస్థానాలు శాసనవ్యవస్థలోని చొచ్చుకు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థలు శాసనవ్యవస్థలోకి రావడమంటే వాటి అధికారాలను కబ్జా చేయటమేనని విమర్శించారు. ఇటీవల కాలంలో న్యాయస్థానాలు తరుచూ ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాయని ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యానికి మంచికాదని స్పష్టం చేశారు.
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు శాసనసభలో చట్టాలు చేస్తే కొందరు రాజకీయ స్వలాభాల కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. అయితే చట్టాలు అమలు కాకుండా న్యాయస్థాలు సైతం అడ్డుపడటంపై తమ్మినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో న్యాయస్థానాలకు.. ప్రభుత్వాలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుందని తెలిపారు.
Also Read: జగన్ కు కేంద్రం షాక్: దోస్తీ అంటూనే ఫుట్ బాల్ ఆడేస్తున్నారు
ఒకప్పుడు న్యాయస్థానాలు.. శాసన.. కార్యనిర్వాహాక వ్యవస్థలు దేనికదే బాధ్యతగా వ్యవహరించేవని తెలిపారు. ఎవరి హద్దుల్లో వారు ఉండేవారని.. కానీ ఇటీవల కాలంలో ఈ వ్యవస్థలు హద్దులు దాటుతున్నాయని తెలిపారు. కొందరు ముఖస్తుతి కోసం బాధ్యతలు పరిమితి దాటి వ్యవహరిస్తుండటం ఇతర వ్యవస్థలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు.
జగన్ సర్కార్ కు న్యాయ స్థానాలకు మధ్య నిత్యం చోటుచేసుకున్న ఘర్షణ నేపథ్యంలోనే తమ్మినేని ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. అయితే తమ్మినేని మాత్రం ఎక్కడా కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ పేరుగానీ.. ప్రభుత్వాల పేర్లుగానీ ప్రస్తావించకుండా సూతిమెత్తగా ఆయన చెప్పాలనుకున్నది చెప్పేశారు. శాసన వ్యవస్థలో న్యాయస్థానాలు అతిజోక్యం చేసుకుంటున్నాయని తమ్మినేని చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్